కొవిడ్‌ డాగ్‌: పరిశోధనల కోసం రూ.4.5 కోట్లు!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్‌-19 వైరస్‌ను గుర్తించడమే ఎంతో కీలకం. ఇప్పటివరకు లక్షణాలు ఉన్నవారిని గుర్తించి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా జాగిలాలను ఉపయోగించి కరోనా వైరస్‌ సోకినవారిని గుర్తించేందుకు పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు.

Updated : 19 May 2020 14:00 IST

లండన్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్‌-19 వైరస్‌ను గుర్తించడమే ఎంతో కీలకం. ఇప్పటివరకు లక్షణాలు ఉన్నవారిని గుర్తించి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే జాగిలాలను కూడా ఉపయోగించి కరోనా వైరస్‌ సోకినవారిని గుర్తించేందుకు పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. ఒకవేళ ఇది సాధ్యమైతే అత్యంత వేగంగా, రోగులనుంచి ఎలాంటి హాని లేకుండా కరోనా సోకిన వ్యక్తుల్ని గుర్తించే వీలుంటుందని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ప్రఖ్యాత లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌, డర్హమ్‌ యూనివర్సిటీతోపాటు మరో స్వచ్ఛంద సంస్థ కలిసి పరిశోధనలు మొదలుపెట్టాయి. ఈ పరిశోధనల కోసం తాజాగా 5లక్షల పౌండ్లు(దాదాపు నాలుగున్నర కోట్లు) అందజేసినట్లు బ్రిటన్‌ ప్రభుత్వం వెల్లడించింది.

ఇప్పటికే కొన్ని రకాల క్యాన్సర్లను జాగిలాలు గుర్తిస్తాయని.. ప్రస్తుతం కొవిడ్‌-19 వైరస్‌ను కూడా జాగిలాలు గుర్తించగలుగుతాయా అన్నదానిపై పరిశోధనలు జరుపుతున్నట్లు బ్రిటన్‌ మంత్రి జేమ్స్‌ బెత్తెల్‌ వెల్లడించారు. ఇది సాధ్యమైతే అత్యంత వేగంగా కరోనా రోగులను గుర్తించే వీలుంటుందని అశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక శిక్షణ ఇచ్చిన జాగిలాలు వాసనతో కొన్ని రకాల క్యాన్సర్లు, పార్కిన్‌సన్‌, మలేరియా వంటి రోగులను ఇప్పటికే గుర్తిస్తున్న విషయాన్ని జేమ్స్‌ గుర్తుచేశారు.

ప్రస్తుతం కొవిడ్‌-19 గుర్తించేందుకు లాబ్రడర్‌, స్పానియల్‌ జాతికి చెందిన ఆరు జాగిలాలను శిక్షణ కోసం సిద్ధం చేశారు. ఒకవేళ ఇది విజయవంతమైతే.. ఒక్కో జాగిలం గంటకు 250 మందిని పరీక్షించగలుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా విమానాశ్రయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఈ వైరస్‌ ఉన్న వారిని సులువుగా గుర్తించే వీలుంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్‌ దేశాలు కూడా వైరస్‌ను గుర్తించేందుకు జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేపనిలో పడ్డట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని