8కోట్ల మంది చిన్నారులు పేదరికంలోకి..!

ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి ప్రభావంతో పేదరికంలోకి జారిపోయే చిన్నారుల సంఖ్య ఈ ఏడాది చివరినాటికి 8కోట్ల 60లక్షలకు చేరుకుంటుందని యునిసెఫ్‌ నివేదించింది.

Updated : 28 May 2020 16:12 IST

యునిసెఫ్‌ నివేదిక..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి ప్రభావంతో పేదరికంలోకి జారిపోయే చిన్నారుల సంఖ్య ఈ ఏడాది చివరినాటికి 8కోట్ల 60లక్షలకు చేరుకుంటుందని యునిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. గతంతో పోలిస్తే ఇది ఒకేసారి 15శాతం పెరుగుతుందని తాజా నివేదికలో వెల్లడించింది. కరోనా ప్రభావంతో కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునే చర్యలు తక్షణమే చేపట్టకపోతే.. అల్ప, మధ్య ఆదాయ దేశాల్లోని దాదాపు 67.2కోట్ల మంది జాతీయ పేదరిక స్థాయికన్నా దిగువకు పడిపోతారని యునిసెఫ్‌ అంచనా వేసింది. ముఖ్యంగా ఐరోపా, మధ్య ఆసియా ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువ ఉంటుందని తెలిపింది. 

ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా కుటుంబాల్లో ఉన్న వనరులు తరిగిపోతూ..సామాజిక, ఆర్థిక సంక్షోభానికి కారణం అవుతున్నట్లు యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెన్రీఎట్టా ఫోర్‌ వెల్లడించారు. కుటుంబాల్లో ఏర్పడే ఈ ఆర్థిక సమస్యలు పేదరికాన్ని తగ్గించే ప్రక్రియను మరింత నెమ్మదిపరుస్తాయని తెలిపారు. అంతేకాకుండా, ఇది పిల్లలకు కావాల్సిన కనీస అవసరాలకు దూరం చేసే ప్రమాదం ఉందని హెన్నీఎట్టా అన్నారు. ఈ సమయంలో అలాంటి కుటుంబాలకు కనీస అవసరాలైన ఆహారం, నీరు, చదువు, వైద్య సదుపాయాలను అందించకుంటే.. వారు జీవితంలో చవిచూడని పేదరికాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని యునిసెఫ్‌, సేవ్‌ ది చిల్డ్రన్‌ సంస్థలు హెచ్చరించాయి.

ఈ మహమ్మారి విలయతాండవ ప్రభావం ముఖ్యంగా చిన్నపిల్లల్లోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని యునిసెఫ్‌ నివేదించింది. ఆకలి, పోషకాహార లోపం ప్రభావం చిన్నారులపై జీవితకాలం మొత్తం ఉంటుంది. అందుకే వీటిని ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని సేవ్‌ ది చిల్డ్రన్‌ అంతర్జాతీయ సీఈఓ ఇంగర్‌ అషింగ్‌ అన్నారు. ఈ నివేదిక ప్రపంచానికి ఒక మేల్కొలుపు కావాలని అషింగ్‌ సూచించారు. ఇలాంటి సమయంలో కుటుంబాలను కాపాడేందుకు సామాజిక భద్రత, ఉద్యోగ, ఆర్థిక విధానాలను తక్షణమే రూపొందించేందుకు ఆయా ప్రభుత్వాలు నిమగ్నం కావాలని యునిసెఫ్‌ నివేదిక సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని