గాంధీ విగ్రహంపై రంగులు చల్లిన నిరసనకారులు

అమెరికా పోలీసుల చేతిలో మృతిచెందిన ఆఫ్రికన్‌-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఘటనతో దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో కొందరు నిరసనకారులు హింసాత్మక ఘటనలతో పాటు, దాడులకు పాల్పడుతుండటం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో వాషింగ్టన్‌ డీసీలోని భారత రాయబార కార్యాలయం ముందున్న మహాత్మాగాంధీ విగ్రహా రూపాన్ని ఆందోళనకారులు చెడగొట్టారు.

Updated : 04 Jun 2020 18:31 IST

క్షమాపణలు కోరిన అమెరికా

వాషింగ్టన్‌: అమెరికా పోలీసుల చేతిలో మృతిచెందిన ఆఫ్రికన్‌-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఘటనతో అగ్రరాజ్యంలో నిరసనలు హోరెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు నిరసనకారులు హింసాత్మక ఘటనలతో పాటు, దాడులకు పాల్పడుతుండటం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో వాషింగ్టన్‌ డీసీలోని భారత రాయబార కార్యాలయం ముందున్న మహాత్మాగాంధీ విగ్రహా రూపాన్ని ఆందోళనకారులు అగౌరవపరిచారు. గాంధీ విగ్రహంపై రంగులు చల్లినట్లు గుర్తించిన అక్కడి అధికారులు, విగ్రహాన్ని కవర్‌తో కప్పివేశారు. ఆ ఘటనపై అమెరికాలోని పార్క్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన అమెరికా, గాంధీ విగ్రహానికి జరిగిన అవమానంపై క్షమాపణలు కోరింది.

జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి వ్యతిరేకంగా నిరసనకారులు చేస్తున్న హింసాత్మక ఘటనలు, విధ్వంసాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయని భారత్‌లోని అమెరికా రాయబారి కెన్‌ జస్టర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనకారుల చేష్టలతో ‘వాషింగ్టన్‌ డీసీలో ఉన్న గాంధీ విగ్రహానికి జరిగిన అవమానానికి చింతిస్తున్నాం. దీనిపై క్షమాపణలు కోరుతున్నాం. వివక్ష, పక్షపాతవైఖరికి వ్యతిరేకంగా మేము కట్టుబడి ఉన్నాం. తొందరలోనే వీటి నుంచి బయటపడతాం’ అని కెన్‌ జస్టర్‌ ట్విటర్‌లో ప్రకటించారు.

అమెరికా పోలీసుల చేతిలో మృతిచెందిన ఫ్లాయిడ్‌ ఘటన అనంతరం దేశవ్యాప్తంగా నిరసన సెగలు, భారీ ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ‘ఐ కాంట్ బ్రీత్‌’ పేరుతో మొదలైన ఈ నిరసనలు ప్రభుత్వ ఆస్తులు తగులబెట్టడం, చాలా చోట్ల విధ్వంసానికి కారణమవుతున్నాయి. అమెరికాలో వివక్ష, జాత్యాహంకారానికి ముగింపు పలకాలని డిమాండ్‌ చేస్తూ ప్రదర్శిస్తున్న నిరసనలు ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని అణచివేసేందుకు అవసరమైతే సైన్యాన్నే రంగంలోకి దించుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు.

 

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని