కరోనా విజృంభణ.. దిల్లీ సర్కార్‌ కీలక ఆదేశాలు  

కరోనా విజృంభణతో దేశ రాజధాని నగరం వణుకుతోంది. దిల్లీలో ఇప్పటివరకు 53,116 కేసులు నమోదవ్వడంతో అక్కడి......

Published : 20 Jun 2020 18:23 IST

దిల్లీ: కరోనా విజృంభణతో దేశ రాజధాని నగరం వణుకుతోంది. దిల్లీలో ఇప్పటివరకు 53,116 కేసులు నమోదవ్వడంతో అక్కడి ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులతో పాటు ఇతర సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా అత్యధికంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత దిల్లీ మూడో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. 

రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ఆస్పత్రులు, వైద్య సంస్థలకు చెందిన ఎండీలు, డీన్‌లు, డైరెక్టర్లు ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎవరైనా సెలవుల్లో ఉంటే వారిని తక్షణమే విధుల్లో చేరేలా ఆదేశాలివ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.  అత్యవసర పరిస్థితుల్లో అయితే సెలవులు తీసుకోవచ్చని తెలిపింది. 

కరోనా రోగులకు కచ్చితంగా ఐదు రోజులు సంస్థాగత క్వారంటైన్‌లో ఉంచాల్సిందేనంటూ దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ జారీచేసిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. వైద్యులు, నర్సులతో పాటు క్వారంటైన్‌ వసతులు నిర్వహించేందుకు కొరత నెలకొన్న వేళ సెలవులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

కరోనా రోగులకు ఐదు రోజుల పాటు సంస్థాగత క్వారంటైన్‌ విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తప్పని ఆప్‌ ఎమ్మెల్యే అతిషీ అభిప్రాయపడ్డారు. తాను కరోనా బారిన పడ్డాననీ.. హోం క్వారంటైన్‌లో ఉండటంతో త్వరగా కోలుకొనేందుకు కుటుంబ సభ్యులు సైతం సహకరిస్తున్నారన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని