
బ్రేకింగ్.. ఆగస్టు 12వరకు రైళ్లు రద్దు
ప్రత్యేక రైళ్లు కొనసాగుతాయి
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ రైల్వే శాఖ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. టైం టేబుల్ ఆధారిత అన్ని రెగ్యులర్ ప్రయాణికుల రైలు సర్వీసులను (మెయిల్/ ఎక్స్ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ రైళ్లు) ఆగస్టు 12 వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో జులై 1 నుంచి ఆగస్టు 12 మధ్య చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దవుతాయని రైల్వే బోర్డు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
కరోనా కట్టడికి మార్చిలో విధించిన లాక్డౌన్ నిర్ణయంతో అన్ని రెగ్యులర్ ప్యాసింజర్ రైలు సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసిన విషయం తెలిసిందే. తదుపరి నోటీసు జారీ చేసే వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని అప్పట్లో తెలిపింది. ఆ తర్వాత దాన్ని మే 3 వరకు పొడిగించింది. అప్పటికీ కరోనా మహమ్మారి అదుపులోకి రాకపోవడంతో రైళ్ల రద్దును జూన్ 30 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. తాజాగా దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్న వేళ మరోసారి రెగ్యులర్ ప్యాసింజర్ రైలు సర్వీసుల రద్దు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో లాక్డౌన్ మూలంగా పలు చోట్ల చిక్కుకున్న వసల కూలీలను తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్ ప్రత్యేక రైళ్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మరికొన్ని రైళ్లు మాత్రం యథాతథంగా నడవనున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.