Mucormycosis: ఫంగస్‌ను పేరుతో పిలుద్దాం

కరోనా బాధితుల్లో కనిపిస్తున్న ఫంగస్‌ మ్యుకర్‌మైకోసిస్‌ను పేరుతో గుర్తిస్తే మంచిదని,

Published : 25 May 2021 11:48 IST

రంగులతో గుర్తింపు గందరగోళమే

మ్యుకర్‌మైకోసిస్‌ అంటువ్యాధి కాదు..

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా 

ఈనాడు, దిల్లీ: కరోనా బాధితుల్లో కనిపిస్తున్న ఫంగస్‌ మ్యుకర్‌మైకోసిస్‌ను పేరుతో గుర్తిస్తే మంచిదని, దానిని వివిధ రంగులతో చెప్పడం గందరగోళానికి దారితీస్తుందని దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌సింగ్‌ గులేరియా వెల్లడించారు. బ్లాక్‌ ఫంగస్‌ అన్నది వేరే కుటుంబానికి చెందినదని తెలిపారు. ‘ఆక్సిజన్‌ చికిత్స వల్లే కచ్చితంగా మ్యుకర్‌మైకోసిస్‌ వస్తుందని చెప్పలేం. ఆక్సిజన్‌ లేకుండా ఇంటి వద్ద చికిత్స పొందిన వారిలోనూ ఈ ఫంగస్‌ కనిపిస్తోంది’ అని చెప్పారు. గులేరియా సోమవారం దిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మ్యుకర్‌మైకోసిస్‌ అంటువ్యాధికాదన్నారు.

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే..

మ్యుకర్‌మైకోసిస్‌తో పాటు క్యాండిడా, యాస్పర్‌జిలోసిస్, క్రిప్టోకోకస్, హిస్టోప్లాస్మా, కాక్సిమైడొకోసిస్‌ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు ఉన్నాయని గులేరియా తెలిపారు. రోగ నిరోధశక్తి తక్కువ ఉన్న వ్యక్తుల్లో మొదటి మూడు రకాల ఇన్‌ఫెక్షన్లు రావచ్చని అభిప్రాయపడ్డారు. కరోనాకు స్టెరాయిడ్స్, మధుమేహం జత కలిసినప్పుడూ మ్యుకర్‌ వస్తుందని, ఇది ముక్కు, సైనస్, కంటి చుట్టూ ఉన్న ఎముక వలయంతో పాటు మెదడు వరకు విస్తరించే అవకాశం ఉంటుందన్నారు. మ్యుకర్‌మైకోసిస్‌ అరుదుగా ఊపిరితిత్తులకు వెళ్తుందని, దాన్ని పల్మనరరీ మ్యుకర్‌మైకోసిస్‌ అంటారని తెలిపారు.

> క్యాండిడా నోట్లో వచ్చినప్పుడు నాలుక మీద తెల్లమచ్చలు వస్తాయి. జననేంద్రీయాల మీదా ఈ ఇన్‌ఫెక్షన్‌ రావొచ్చు. రక్తంలో విస్తరించినప్పుడు క్యాండిడీమియా అంటారు. 

> యాస్పర్‌జిలోసిస్‌ ఫంగస్‌ ఎక్కువగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. దానివల్ల అలెర్జిక్‌ రియాక్షన్స్‌ వస్తాయి.

> ఇప్పుడు మ్యుకర్‌మైకోసిస్‌ ఫంగసే అధికంగా కనిపిస్తోంది. కొందరిలోనే యాస్పర్‌జిలోసిస్‌ ఉంటోంది. మరికొందరిలో క్యాండిడా ఇన్‌ఫెక్షన్‌ కనిపిస్తోంది.

> ఒక్కోచోట పుట్టుకొచ్చే ఫంగస్‌ ఒక్కో రంగులో ఉండొచ్చు. దాన్ని వేర్వేరు రంగుల పేర్లతో పిలవడం వల్ల అయోమయం తలెత్తుతుంది.

మధుమేహుల్లో అత్యధికం

ఇప్పటివరకు మ్యుకర్‌మైకోసిస్‌ సోకిన వారిలో 92-95% మంది మధుమేహులేనని, దానికితోడు స్టెరాయిడ్స్‌ తీసుకొన్నవారై ఉంటున్నారని గులేరియా తెలిపారు. ఈ రెండూలేని వారిలోనూ అరుదుగా ఈ ఫంగస్‌ కనిపిస్తోందని చెప్పారు. ఆక్సిజన్‌ వాడేటప్పుడు దాని ట్యూబ్‌ను శుభ్రంగా ఉంచుకోవడం, హ్యుమిడిఫికేషన్‌ స్టెరైల్‌ వాటర్‌ వాడటం మంచిదన్నారు. కొవిడ్‌ పాజిటివ్‌గా ఉన్న దశలోనే కొందరికి మ్యుకర్‌ ఫంగస్‌ వస్తోందని పేర్కొన్నారు.

ముందస్తు హెచ్చరికలివే...

తలనొప్పి, ముక్కులు బిగుసుకుపోవడం, ముక్కు నుంచి అప్పుడప్పుడు రక్తంకారడం, కళ్ల కింద మొహంపై ఒకవైపు వాపురావడం, స్పర్శ తగ్గిపోయి, నొప్పి ఎక్కువగా ఉండటం మ్యుకర్‌ ముందస్తు హెచ్చరిక సంకేతాలని గులేరియా పేర్కొన్నారు. ఇలాంటి లక్షణాలున్న వారు డాక్టర్లను సంప్రదించి సత్వరమే చికిత్స పొందడం మంచిదని తెలిపారు. 

తొలి ఉద్ధృతి తర్వాత కొవిడ్‌ తగ్గిపోయిన వారిలోనూ 12 వారాల వరకూ సమస్యలు ఉంటున్నాయని గులేరియా వివరించారు. శ్వాస సంబంధ సమస్య, ఛాతీ బిగుసుకున్నట్లు అనిపించడం, దగ్గు, భయాందోళన వంటివి ఉంటాయన్నారు. అలాంటి వారికీ చికిత్స అందించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని