Choksi: ఛోక్సీ విమాన టికెట్లు ఇవ్వజూపాడు

పరారీలో ఉన్న భారత నగల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ తన కోసం చాలాసార్లు హోటల్‌ గదులను బుక్‌ చేసేందుకు ముందుకొచ్చాడని.. ఆయన ప్రియురాలిగా ప్రచారంలో

Updated : 09 Jun 2021 10:44 IST

హోటల్‌ గదులూ బుక్‌ చేస్తానన్నాడు 

 బార్బరా జబరికా వెల్లడి 

దిల్లీ: పరారీలో ఉన్న భారత నగల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ తన కోసం చాలాసార్లు హోటల్‌ గదులను బుక్‌ చేసేందుకు ముందుకొచ్చాడని.. ఆయన ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న బార్బరా జబరికా చెప్పారు. విమాన ప్రయాణ టికెట్లనూ ఇవ్వజూపాడని తెలిపారు. తాను మాత్రం తమ మధ్య కేవలం స్నేహాన్నే కోరుకున్నానని స్పష్టం చేశారు. జబరికా తనను వలలో ఇరికించి, కిడ్నాప్‌నకు సహకరించిందంటూ ఛోక్సీ తాజాగా చేసిన ఆరోపణలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో ఆమె స్పందించారు. 

‘‘ఛోక్సీతో నేను ఉదయపు నడకకు, కాఫీకి, రాత్రి భోజనాలకు వెళ్లేదాన్ని. నా అపార్ట్‌మెంట్‌కు కూడా అతడు వచ్చాడు. మా మధ్య సంబంధం.. స్నేహం, వ్యాపారానికి పరిమితమవ్వాలనే నేను ఎప్పుడూ కోరుకునేదాన్ని. అతడు మాత్రం నాకు హోటల్‌ బిల్లులు, విమాన టికెట్ల రుసుములు చెల్లించేందుకు పదేపదే ముందుకొచ్చేవాడు. నేను వాటన్నింటినీ తిరస్కరించేదాన్ని. ఎందుకంటే వాటి చెల్లింపుతో మా మధ్య సంబంధాన్ని అతడు అపార్థం చేసుకునే అవకాశముంటుంది’’ అని జబరికా పేర్కొన్నారు. ‘‘ఆంటిగ్వాలో ఛోక్సీ బొటిక్‌ హోటళ్లు, క్లబ్‌లు పెట్టాలని కోరుకున్నాడు. నేను ప్రాపర్టీ సంబంధిత రంగంలో ఉండటంతో, నాతో కలిసి వ్యాపారం చేసేందుకు ప్రయత్నించాడు. హోటళ్లు, క్లబ్‌ల ఏర్పాటుకు నిధులు ఇస్తానని చెప్పేవాడు’’ అని తెలిపారు. 

రాజ్‌ అనే పేరుతో.. 
ఆంటిగ్వాలో ఛోక్సీ ఆరు నెలల్లో 6-8 ఫోన్‌ నంబర్లు మార్చాడని జబరికా పేర్కొన్నారు. తన పేరును ‘రాజ్‌’గా చెప్పుకొంటూ సందేశాలు పంపేవాడని చెప్పారు. ఆంటిగ్వా ప్రజలు, పలు రెస్టారెంట్ల సిబ్బంది అతణ్ని రాజ్‌ అనే పిలిచేవారని.. అతడి అసలు పేరు ఎవరికీ తెలియదని చెప్పారు.

ఛోక్సీ భవిష్యత్తును కోర్టులే తేలుస్తాయ్‌: డొమినికా ప్రధాని 

ఛోక్సీ భవితవ్యాన్ని కోర్టులే తేలుస్తాయని డొమినికా ప్రధాని రూజ్‌వెల్ట్‌ స్కిర్రిట్‌ అన్నారు. ‘‘భారత పౌరుడి విషయం కోర్టులో ఉంది. అతడి భవితవ్యం న్యాయస్థానాల్లోనే తేలుతుంది. విచారణ త్వరగా జరిగేలా చూస్తాం. బెయిలు కోసం దాఖలు చేసుకున్న పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది కాబట్టి అతడి హక్కులకు ప్రాధాన్యమిస్తాం. ఛోక్సీ విషయంలో ఆంటిగ్వాలో ఏం జరుగుతోందో, భారత్‌లో ఏం జరుగుతోందో తెలుసుకునే ఆసక్తి మాకు లేదు’’ అని రూజ్‌వెల్ట్‌ పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని