Princess Mako: సామాన్యుడి ప్రేమ కోసం.. రూ.10 కోట్లు వదులుకున్న జపాన్‌ రాకుమారి

రాకుమారి ప్రేమ కోసం తోటరాముడు ఎన్ని కష్టాలు పడ్డాడో ‘పాతాళభైరవి’ సినిమాలో చూశాం.

Updated : 02 Oct 2021 10:52 IST

టోక్యో: రాకుమారి ప్రేమ కోసం తోటరాముడు ఎన్ని కష్టాలు పడ్డాడో ‘పాతాళభైరవి’ సినిమాలో చూశాం. జపాన్‌ రాజకుటుంబ కథలో ఈ కష్టాలు తారుమారయ్యాయి. తోటరాముడు న్యాయవాద విద్య అభ్యసించేందుకు తుర్రుమని న్యూయార్క్‌ వెళ్లిపోయాడు. రాణివాసాన రామచిలకలా మిగిలిపోయిన రాకుమారి మూడేళ్ల నిరీక్షణ తర్వాత కూడా తన ప్రేమను నిలబెట్టుకొని కథను పెళ్లిపీటల దాకా తీసుకొచ్చింది. ఈ కథలో నేపాళ మాంత్రికుడు లేకపోయినా ఆర్థిక వివాదాలు విలన్‌ పాత్ర పోషించి వారి ప్రేమను పరీక్షించాయి. మధ్యలో తీవ్ర మానసిక ఒత్తిడి వంటి రుగ్మతలు వేధించినా.. కాలపరీక్షలో నెగ్గిన జపాన్‌ రాకుమారి మకో (30) తన ప్రియుడు కీ కొమురో (29)ను అక్టోబరు 26న పెళ్లాడనుంది. జపాన్‌ చక్రవర్తి నరుహిటో మేనకోడలైన మకోకు టోక్యో ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ యూనివర్శిటీలో కొమురో సహాధ్యాయి. 2017లోనే ఈ జంట తాము ప్రేమపెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. మరుసటి ఏడాది.. కొమురో తల్లి కారణంగా తలెత్తిన ఆర్థిక వివాదాలతో ఈ పెళ్లి అప్పట్లో రద్దయింది. దీంతో న్యూయార్క్‌ వెళ్లిపోయిన కొమురో ‘లా’ చదివి, వారం రోజుల కిందటే జపాన్‌కు తిరిగొచ్చాడు. ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా అతడు జపాన్‌ వైపు తిరిగి చూడలేదు. వీరిద్దరి పెళ్లికి అంగీకరించిన రాజకుటుంబం గతంలోని ఆర్థిక వివాదాలతో ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నందున.. వివాహానికి పెద్దగా హడావుడి చేయట్లేదని శుక్రవారం ప్రకటించింది. వివాహానంతరం ఈ జంట న్యూయార్క్‌ వెళ్లి అక్కడే స్థిరపడనుంది. జపాన్‌ రాజకుటుంబ మహిళలు సామాన్యులను పెళ్లాడితే రాచరికాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సిద్ధపడ్డ మకో రాజభరణం కింద తనకు వచ్చే రూ.10 కోట్ల (150 మిలియన్‌ యెన్‌లు) మొత్తాన్ని కూడా తిరస్కరించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని