Published : 08/12/2021 10:31 IST

Undisclosed Assets: 930 సంస్థల్లో రూ.20,053 కోట్ల అప్రకటిత ఆస్తుల గుర్తింపు

రాజ్యసభకు తెలిపిన కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి

పనామా, ప్యారడైజ్‌ పత్రాల్లో వెల్లడైన వివరాల ఆధారంగా 930 భారతీయ సంస్థల నుంచి రూ.20,353 కోట్ల అప్రకటిత ఆస్తులను గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. వాటి ద్వారా ఇప్పటివరకూ రూ.153.88 కోట్ల పన్నులను వసూలు చేసినట్లు తెలిపింది. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి ఈ మేరకు మంగళవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 52 కేసుల్లో నల్లధనం(అప్రకటిత విదేశీ ఆదాయం, ఆస్తులు), ఆదాయ పన్ను విధింపు చట్టాల కింద క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ ఫిర్యాదులు నమోదు చేసినట్లు చెప్పారు. మరో 130 కేసుల్లోనూ చర్యలు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. ఇటీవల పాండోరా పత్రాల్లో బహిర్గతమైన భారతీయ సంస్థలు, వ్యక్తులపైనా ప్రభుత్వం దృష్టిపెట్టినట్లు తెలిపారు. దర్యాప్తును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, ఆర్బీఐ, ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ తదితర సంస్థల సమన్వయంతో ఏర్పాటు చేసిన బహుళ సంస్థల సముదాయానికి (ఎంఏజీ) ఆ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు.

జనన, మరణ ధ్రువీకరణ చట్ట సవరణకు ముసాయిదా సిద్ధం: కేంద్రం
‘జనన, మరణ ధ్రువీకరణ చట్టం-1969’లో సవరణకు సంబంధించి ముసాయిదాను సిద్ధం చేసినట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్రాల్లోని పౌర ధ్రువీకరణ రికార్డులను ఏకీకృతం చేసి, దాన్ని జాతీయ డేటాబేస్‌తో అనుసంధానం చేసేందుకు వీలుగా ఈ సవరణను చేయనున్నట్లు వెల్లడించింది. ఈమేరకు ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ లోక్‌సభకు ఈ విషయాన్ని వెల్లడించారు.

44 బహుళ రాష్ట్ర క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీల మూసివేత: అమిత్‌షా
9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 44 బహుళ రాష్ట్ర క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీలను మూసివేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్‌ షా ఈమేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రాథమిక వ్యవసాయ రుణ సహకార కేంద్రాల సమాచారాన్ని కంప్యూటరీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, నాబార్డ్‌ తదితర సంస్థల సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు.

కొలీజియం వ్యవస్థను పునఃపరిశీలించాలి: లోక్‌సభలో సభ్యుల డిమాండ్‌
సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులను నియమించే విషయంలో కొలీజియం వ్యవస్థను పునఃపరిశీలించాలని లోక్‌సభ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. న్యాయవ్యవస్థలో ఖాళీలు, కేసుల పెండింగ్‌పై వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్దిష్ట వయసొచ్చిన సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులకు పెంచిన పింఛన్‌ను ఎప్పుడు అందించాలనే అంశంపై స్పష్టత కల్పించేందుకుగానూ రెండు న్యాయ చట్టాల సవరణ బిల్లులపై మంగళవారం లోక్‌సభలో చర్చ జరిగింది. కొందరు సభ్యులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా హైకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్‌ వయసును పెంచాల్సిన అవసరముందన్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల (వేతనాలు, విధుల షరతులు) సవరణ బిల్లుపై చర్చలో కాంగ్రెస్‌ సభ్యుడు శశిథరూర్‌ మాట్లాడుతూ.. పెద్ద ఎత్తున కేసులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఆర్టికల్‌ 370 రద్దుకు సంబంధించిన కేసుల్లో న్యాయవ్యవస్థపై కార్యనిర్వాహక వ్యవస్థ ప్రభావం చూపిందన్నారు. రిటైర్డ్‌ జడ్డీల పింఛన్ల విషయంలో సుప్రీం కోర్టు సమర్థించిన రెండు హైకోర్టుల తీర్పులను రద్దు చేసేలా ప్రస్తుత బిల్లు ఉందని, దీనిపై పునరాలోచించాలని బీజేడీ ఎంపీ పినాకి మిశ్రా సూచించారు. జాతీయ న్యాయ వ్యవస్థ నియామకాల కమిషన్‌(ఎన్‌జేఏసీ)ను ఏర్పాటు చేయడానికి గతంలో తెచ్చిన బిల్లును నిర్దిష్ట మార్పులతో మళ్లీ తీసుకురావాలని కోరారు. భాజపా ఎంపీ పీపీ చౌధరి మాట్లాడుతూ ప్రభుత్వం కొలీజియం వ్యవస్థను పునఃపరిశీలించాలని అభ్యర్థించారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఎలాంటి పాత్రా లేకపోవడం వల్ల ఆయన పార్లమెంటుకు జవాబుదారీగా ఉండలేని పరిస్థితి ఉందన్నారు. డీఎంకే సభ్యుడు దయానిధి మారన్‌ మాట్లాడుతూ జడ్జీల రిటైర్మెంట్‌ వయసును పెంచాలని, ఖాళీల్లో కొందరిని షెడ్యూల్డ్‌ కులాల నుంచి నియమించాలని కోరారు.

భారీగా పెరిగిన నకిలీనోట్ల స్వాధీనం
దిల్లీ: దేశంలో గతేడాది స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్ల విలువలో భారీ వృద్ధి నమోదైంది. పెద్దనోట్ల రద్దు తర్వాత నకిలీ నోట్ల చెలామణిలో తగ్గుదల గురించి మంగళవారం రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌధరి ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని వెల్లడించింది.

నేషనల్‌ క్రైం రికార్డ్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం.. గత అయిదేళ్లలో ఒక్క ఏడాది మినహా మిగిలిన అన్ని సంవత్సరాల్లో స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్ల విలువ పెరిగినట్లు కేంద్ర మంత్రి వివరించారు.
స్థూల జాతీయ ఉత్పత్తిలో నగదు చెలామణి నిష్పత్తి పెరిగినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
నగదుకు ప్రజల నుంచి డిమాండు పెరగడం, జీడీపీలో తరుగుదల నమోదుకావడం వల్ల నగదు చెలామణి నిష్పత్తి 12% (2019-20) నుంచి 14.5% (2020-21)కి పెరిగినట్లు తెలిపారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని