Suspension of MLAs:ఆ చర్య బహిష్కరణ కన్నా ఘోరం

శాసనసభ్యులను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేయడం బహిష్కరణ కన్నా భయంకరమైనదని, దాని పర్యవసానాలు తీవ్రంగా..

Updated : 12 Jan 2022 10:45 IST

12 మంది భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై సుప్రీం

దిల్లీ: శాసనసభ్యులను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేయడం బహిష్కరణ కన్నా భయంకరమైనదని, దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది. శాసనసభలో నియోజకవర్గం తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కుపై ప్రభావం చూపుతుందని తెలిపింది. మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ 12 మంది భాజపా ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఖాళీ అయిన స్థానాన్ని ఆరు నెలల్లోగా భర్తీ చేయాలన్న చట్ట నిబంధనను ఈ సందర్భంగా గుర్తుచేసింది.

‘రాజ్యాంగ శూన్యతను, నియోజకవర్గంలో అనిశ్చిత పరిస్థితిని సృష్టించడం తగదు. అది ఒక్క నియోజకవర్గమా 12 నియోజకవర్గాల అన్నది కాదు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించే విషయంలో ప్రతి నియోజకవర్గానికీ సమాన హక్కు ఉంటుంది’ అని జస్టిస్‌ ఖాన్విల్కర్, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరీ, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘సభ్యుడిని సస్పెండ్‌ చేసే అధికారం సభకు ఉంటుంది. కానీ, ఆ వ్యవధి 59 రోజులకు మించరాదు’ అని స్పష్టం చేసింది. పలు రాజ్యాంగ నిబంధనలను ప్రస్తావిస్తూ సస్పెన్షన్‌ కాలపరిమితి విషయంలో అలా జరిగి ఉండాల్సి కాదని అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది మాట్లాడుతూ...ఈ అంశంపై చర్చించుకుని వస్తామని తెలిపారు. కేసు తదుపరి విచారణ ఈ నెల18వ తేదీకి వాయిదాపడింది. సభాపతి ఛాంబరులో ప్రిసైడింగ్‌ అధికారి అధికారి పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ మహారాష్ట్ర అసెంబ్లీ గత ఏడాది జులై 5న 12 మంది భాజపా ఎమ్మెల్యేలను ఏడాదిపాటు సస్పెండ్‌ పాటు సస్పెండ్‌ చేసే తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీనిని ఆ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని