భారత్‌-చైనా సత్సంబంధాలతో ప్రపంచానికి మేలు

భారత్‌-చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలని, దానివల్ల ఆసియాకే కాకుండా యావత్‌ ప్రపంచ భద్రతకూ ఎంతో లబ్ధి కలుగుతుందని మన దేశంలో రష్యా రాయబారి డెనిస్‌ అలిపోవ్‌ చెప్పారు.

Published : 07 Feb 2023 04:34 IST

రష్యా రాయబారి డెనిస్‌ అలిపోవ్‌ ఉద్ఘాటన

దిల్లీ: భారత్‌-చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలని, దానివల్ల ఆసియాకే కాకుండా యావత్‌ ప్రపంచ భద్రతకూ ఎంతో లబ్ధి కలుగుతుందని మన దేశంలో రష్యా రాయబారి డెనిస్‌ అలిపోవ్‌ చెప్పారు. భారత్‌-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యంలో తదుపరి అడుగులపై సోమవారం దిల్లీలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత్‌-చైనా ఘర్షణల్ని తనకు అనుకూలంగా వాడుకునేందుకు అమెరికా చురుగ్గా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చైనాతో రష్యాకు ఉన్న సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు 40 ఏళ్లు పట్టిందనీ, సమస్య నుంచి బయటపడేందుకు అదొక్కటే మార్గమని చెప్పారు. సరిహద్దు విభేదాలు పూర్తిగా భారత్‌-చైనా ద్వైపాక్షిక అంశమనీ, తాము దానిలో జోక్యం చేసుకోబోమని స్పష్టంచేశారు. ఎంత త్వరగా ఈ రెండు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొంటే ప్రపంచానికి అంత మంచిదని, దీనికి అవసరమైతే తమ వంతు చేయూత అందిస్తామని చెప్పారు. త్వరలో రష్యా నుంచి మూడో విడత ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థలు సరఫరా అవుతాయని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని