అతివ భాగస్వామ్యంపై ఆరెస్సెస్‌ దృష్టి

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ఇకపై చేపట్టే సామాజిక చైతన్య కార్యక్రమాల్లో మహిళా భాగస్వామ్యం పెంపుపై దృష్టి సారించనున్నట్లు సంఘ్‌ సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ వైద్య తెలిపారు.

Published : 13 Mar 2023 04:33 IST

హరియాణాలో ప్రారంభమైన వార్షిక సమావేశాలు

సమాలఖా (హరియాణా): రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ఇకపై చేపట్టే సామాజిక చైతన్య కార్యక్రమాల్లో మహిళా భాగస్వామ్యం పెంపుపై దృష్టి సారించనున్నట్లు సంఘ్‌ సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ వైద్య తెలిపారు. హరియాణాలోని సమాలఖాలో ఆరెస్సెస్‌ మూడు రోజుల వార్షిక సర్వసభ్య సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో గత ఏడాదికాలంలో సంఘ్‌ పరివార్‌తోపాటు అనుబంధ సంస్థల పనితీరు, చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించుకొని.. వచ్చే ఏడాదికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని మన్మోహన్‌ వైద్య చెప్పారు. భారతదేశ స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా స్వావలంబనకు ప్రాధాన్యమిస్తూ తీర్మానం చేస్తామన్నారు. మహిళలపరంగానూ ‘రాష్ట్రీయ సేవికా సమితి’ పేరిట తమకు ఓ బలమైన విభాగం ఉన్నట్లు ఆయన తెలిపారు. సంఘ్‌లో అతి చిన్న విభాగమైన శాఖలను వచ్చే ఏడాదికల్లా లక్షకు పెంచాలన్నది తమ లక్ష్యం అన్నారు. ఈ శాఖల్లో దాదాపు 60% విద్యార్థులు ఉండగా.. మిగతా ఉద్యోగులు, వృత్తి నిపుణులు, పారిశ్రామికవేత్తలు ఉన్నట్లు వివరించారు. 2017-2022 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 7.25 లక్షల యువత నుంచి సంఘ్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతూ ఆరెస్సెస్‌ వెబ్‌సైటుకు విజ్ఞాపనలు వచ్చినట్లు మన్మోహన్‌ వైద్య వెల్లడించారు.

సోషలిస్టు నేతలకు సంఘ్‌ నివాళి

సోషలిస్టు నేతలుగా పేరొందిన సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌లతోపాటు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శాంతిభూషణ్‌లకు ఆరెస్సెస్‌ నివాళులు అర్పించింది. వీరితోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ మోదీకి సైతం శ్రద్ధాంజలి ఘటించింది. హరియాణాలోని సమాలఖాలో జరుగుతున్న సంఘ్‌ వార్షిక సమావేశంలో పలువురు రాజకీయ నేతలు, ప్రముఖుల దివ్యస్మృతికి నివాళులు అర్పించారు. గత ఏడాది కాలంలో దివంగతులైన ముఖ్య వ్యక్తులతోపాటు ఇటీవల మరణించిన సినీ ప్రముఖులు గాయని వాణీ జయరాం, బాలీవుడ్‌ నట-దర్శకుడు సతీశ్‌ కౌశిక్‌ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. సమావేశాల ప్రారంభంలో ఆరెస్సెస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే దివంగత ప్రముఖుల పేర్లు చదివి వినిపించారు. సంఘ్‌ పరివార్‌, అనుబంధ సంస్థల ప్రతినిధుల పేర్లు సైతం ఇందులో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని