నేపాల్‌లో అమృత్‌పాల్‌!

పంజాబ్‌ పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకొని పారిపోయిన ఖలిస్థాన్‌ వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌ నేపాల్‌లో దాక్కున్నట్లు తెలుస్తోంది.

Updated : 28 Mar 2023 05:50 IST

పారిపోకుండా అడ్డుకోవాలని ఆ దేశాన్ని కోరిన భారత్‌

కాఠ్‌మాండూ: పంజాబ్‌ పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకొని పారిపోయిన ఖలిస్థాన్‌ వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌ నేపాల్‌లో దాక్కున్నట్లు తెలుస్తోంది. అతడు అక్కడి నుంచి మరో దేశానికి పారిపోకుండా అడ్డుకోవాలని భారత ప్రభుత్వం నేపాల్‌ను కోరినట్లు కాఠ్‌మాండూ పోస్ట్‌ వార్తాపత్రిక సోమవారం పేర్కొంది. ఈ మేరకు కాఠ్‌మాండూలోని భారత్‌ ఎంబసీ అధికారులు శనివారం కాన్సులర్‌ సర్వీసెస్‌ విభాగానికి లేఖ రాసినట్లు వెల్లడించింది. భారత్‌ పాస్‌పోర్టుతో కానీ లేదా నకిలీ పాస్‌పోర్టుతో కానీ అమృత్‌పాల్‌ మరో దేశానికి పారిపోయే యత్నం చేస్తే అరెస్టు చేసి తమకు సమాచారం అందించాలని ఎంబసీ అధికారులు లేఖలో కోరినట్లు వివరించింది. అమృత్‌పాల్‌ నేపాల్‌లో దాక్కున్నట్లు ఈ లేఖ ద్వారా తెలుస్తోందని ఆ పత్రిక పేర్కొంది. ఈ లేఖతోపాటు అమృత్‌పాల్‌ వ్యక్తిగత వివరాలను నేపాల్‌లోని అన్ని దర్యాప్తు సంస్థలు, హోటళ్లు, ఎయిర్‌లైన్‌ సంస్థలకు పంపించారని, నేపాల్‌-భారత్‌ సరిహద్దుల్లో అధికారులు నిఘా పెంచినట్లు ఆ పత్రిక తెలిపింది. నకిలీ గుర్తింపు వివరాలతో పలు పాస్‌పోర్టులు పొందిన అమృత్‌పాల్‌ ఈ నెల 18 నుంచి పరారీలో ఉన్న సంగతి తెలిసిందే.

మరో అనుచరుడి అరెస్టు

అమృత్‌పాల్‌ మరో సన్నిహిత అనుచరుడు వీరేందర్‌ సింగ్‌ అలియాస్‌ ఫౌజీని అమృత్‌సర్‌ పోలీసులు అరెస్టు చేశారు. అమృత్‌పాల్‌ ప్రైవేటు భద్రత దళంలో అతడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మరోవైపు- అమృత్‌పాల్‌, అతని సహాయకులను అదుపులోకి తీసుకొనే యత్నంలో పోలీసులు అరెస్టు చేసిన సిక్కు యువకులను 24 గంటల్లోగా విడుదల చేయాలని సిక్కు సంస్థ అకల్‌ తఖ్త్‌ అధిపతి జ్ఞానీ హర్‌ప్రీత్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సిక్కుల్లో ఆగ్రహం ఉద్ధృతమవుతుందని పంజాబ్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అమృత్‌పాల్‌ సింగ్‌కు మద్దతుగా అమెరికాలోని న్యూయార్క్‌లో ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద ఆదివారం  నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఖలిస్థాన్‌ అనుకూలురు గుమికూడి భారత్‌ వ్యతిరేక నినాదాలు చేశారు.


ఉత్తరాఖండ్‌లో జీ-20 సదస్సుకు బెదిరింపులు

త్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో ఈనెల 28 నుంచి 30 వరకు నిర్వహించనున్న జీ-20 సదస్సులో పాల్గొనే వారికి ఖలిస్థాన్‌ అనుకూల సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయి. మూడు రోజుల పాటు కొనసాగే సదస్సుకు సంబంధించి వందల మంది ప్రజలతో పాటు పాత్రికేయులకు ఆదివారం రాత్రి ‘సిఖ్‌ ఫర్‌ జస్టిస్‌’ సంస్థ అధినేత గురుపత్వంత్‌ సింగ్‌ పేరుతో  రికార్డు చేసిన సందేశాలు వచ్చాయని అధికారులు వెల్లడించారు. ‘భారతదేశం నుంచి పంజాబ్‌ను వేరు చేసిన తర్వాత రామ్‌నగర్‌ను ఖలిస్థాన్‌లో విలీనం చేస్తామ’ంటూ గురుపత్వంత్‌ సింగ్‌ పేర్కొన్నారని ఉత్తరాఖండ్‌ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ డీఐజీ ఎస్‌.ఏ.కృష్ణరాజ్‌ సోమవారం వివరించారు. బెదిరింపు కాల్స్‌పై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని