RBI - Shaktikanta Das: సెప్టెంబరు 30 తర్వాత రూ.2,000 నోట్లు చెల్లవని చెప్పలేదు

చలామణి నుంచి ఉపసంహరిస్తున్న రూ.2,000 నోట్లను బ్యాంకు శాఖల్లో ప్రజలు మార్చుకుని, వేరే నోట్లు తీసుకునేందుకు మంగళవారం నుంచీ అనుమతించనున్నారు.

Updated : 23 May 2023 13:36 IST

ఆ తర్వాత ఏం చేయాలన్నది అప్పటి పరిస్థితి బట్టి నిర్ణయిస్తాం
 నెలల సమయం ఉంది
కాబట్టి ఆలోపు మార్చుకోవాలని సూచిస్తున్నా
రూ.50,000కు మించి డిపాజిట్‌ చేస్తే పాన్‌ నంబరు ఇవ్వాల్సిందే  
రూ.1,000 నోటు పునఃప్రవేశపెట్టే ప్రతిపాదనేదీ లేదు
ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌  
ఈనాడు - దిల్లీ

చలామణి నుంచి ఉపసంహరిస్తున్న రూ.2,000 నోట్లను బ్యాంకు శాఖల్లో ప్రజలు మార్చుకుని, వేరే నోట్లు తీసుకునేందుకు మంగళవారం నుంచీ అనుమతించనున్నారు. ఇందుకోసం బ్యాంకుల వద్ద తగిన మేర నగదు అందుబాటులో ఉన్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సోమవారం ఇక్కడ వెల్లడించారు. ఈ నోట్ల మార్పిడికి సెప్టెంబరు 30 వరకు అవకాశం ఇచ్చినా, వాటి చెల్లుబాటు అప్పటివరకే పరిమితం అని తాము చెప్పడం లేదన్నారు. ఆలోపు మార్చుకోవడానికి అందరూ ప్రయత్నించాలని సూచించారు. నగదు నిర్వహణ కార్యకలాపాల్లో భాగంగానే వీటిని ఉపసంహరిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రక్రియను అంతులేని కథలా వదిలిపెట్టకూడదన్న ఉద్దేశంతోనే సెప్టెంబరు 30వరకు గడువు విధించామని, ఆ తర్వాత ఏం చేయాలన్నది అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రూ.1000 నోటును పునఃప్రవేశపెట్టే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి లేదని స్పష్టంచేశారు.

నామమాత్ర ప్రభావమే

‘ప్రస్తుతం వ్యవస్థలో ఉన్న నగదులో రూ.2,000 నోట్ల వాటా 10.8 శాతమే. సాధారణ లావాదేవీల్లో ఈ నోట్ల వినియోగం అత్యంత తక్కువగా ఉంది. అందువల్ల మన ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావమేమీ ఉండద’ని ఆర్‌బీఐ గవర్నర్‌ ధీమా వ్యక్తం చేశారు. రూ.2,000 నోట్లు మార్చుకోవడానికి మంగళవారమే బ్యాంకులకు వెళ్లాల్సిన  పనిలేదని, 4 నెలల సమయం ఉన్నందున తీరిక ఉన్నప్పుడు వెళ్లి మార్చుకోవచ్చని చెప్పారు. సెప్టెంబరు 30కల్లా మార్కెట్‌లోని రూ.2,000 నోట్లన్నీ వెనక్కు వస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. రూ.2,000 నోట్ల చెల్లుబాటు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎంతోమంది విదేశాలకు వెళ్లి, కొన్ని నెలల పాటు ఉంటున్నారని, వారి ఇళ్లలో రూ.2,000 నోట్లు మిగిలి ఉంటే, గడువులోపు మార్చుకునేందుకు  వారికి ఎదురయ్యే ఇబ్బందులను సున్నితత్వంతో పరిశీలిస్తామన్నారు. ఈ కసరత్తును ఇబ్బందుల్లేకుండా పూర్తిచేయాలన్నదే తమ లక్ష్యమని సోమవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు.

ప్రశ్న:  ఇప్పుడు ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదు జమ చేస్తే ఆర్‌బీఐ పరిశీలిస్తుందా?

జవాబు: ఆర్‌బీఐ ఎప్పుడూ ఈ పరిశీలన జరపదు. ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం లాంటివి సాధారణంగా పరిశీలన చేస్తుంటాయి.

ప్రశ్న:   గతంలో పెద్దనోట్ల రద్దు ప్రతిపాదనను ప్రభుత్వమే చేసింది. ఇప్పుడీ రూ.2,000 నోటు ఉపసంహరణ ప్రతిపాదన కూడా ప్రభుత్వం నుంచే వచ్చిందా?

జవాబు: ఇవి అంతర్గత విషయాలు. వీటిపై ప్రజలకేమీ ఆసక్తి ఉండదు.

ప్రశ్న: రూ.2,000 నోట్లు చెల్లుతాయని చెబుతూనే, సెప్టెంబరు 30లోపు వాటిని మార్చుకోవాలని చెబుతున్నారు. దీనిపై స్పష్టత ఇస్తారా?

జవాబు: ప్రజలు రూ.2,000 నోట్లను మార్చుకోవాలనే అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్న ఉద్దేశంతోనే సెప్టెంబరు 30 వరకు గడువు ఇచ్చాం. ఏ కసరత్తుకైనా నిర్దిష్ట గడువు లేకపోతే, దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. చిల్లర కష్టమవుతోందనే భావనతో చిన్న దుకాణాలవారు ఇదివరకటి నుంచీ రూ.2,000 నోటును స్వీకరించడం లేదు. ఈ విషయంలో నాకే వ్యక్తిగత అనుభవం ఉంది. అందువల్ల సెప్టెంబరు 30 కల్లా గరిష్ఠసంఖ్యలో నోట్లు వెనక్కు వస్తాయని అంచనావేస్తున్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది నేను ఊహాజనితంగా చెప్పలేను. రూ.2000 నోట్ల చెల్లుబాటు సెప్టెంబరు 30 వరకే అని మేం ఎక్కడా చెప్పలేదు.

ప్రశ్న:  నోట్లు మార్చుకునేందుకు గుర్తింపుకార్డు ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. అంటే నల్లధనం వెలికితీత ఉద్దేశం నెరవేరదు కదా?

జవాబు: బ్యాంకుల్లో నగదు లావాదేవీల నిర్వహణకు ఒక విధానం, మార్గదర్శకాలు ఉన్నాయి. అందువల్లే ఈ నోట్ల మార్పిడికీ అమల్లో ఉన్న నిబంధనలను అనుసరించాలని చెప్పాం కానీ, కొత్త నిబంధనలేమీ తీసుకురావడంలేదు. ఐటీ నిబంధనల ప్రకారం రూ.50,000కు మించి నగదు జమచేస్తే పాన్‌ కార్డ్‌ ఇవ్వాలి. ఇప్పుడూ ఆ నిబంధన వర్తిస్తుంది. ఒక విడతలో రూ.20,000 విలువ వరకే మార్చుకోవచ్చు కనుక ఏ ధ్రువీకరణ అవసరం లేదు. బ్యాంకులకు వచ్చేవారికి నీడ, నీటి సదుపాయాలు కల్పించమనీ సూచించాం.

ప్రశ్న:  పెద్దనోట్లలోనే నకిలీల ముప్పు ఎక్కువన్న ఉద్దేశంతోనే ఉపసంహరిస్తున్నారా?

జవాబు: మోసగాళ్లు ఎప్పుడూ పెద్దనోట్లలో నకిలీలు తీసుకురావడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. కానీ రూ.2,000, రూ.500 నోట్ల భద్రతా ప్రమాణాల్లోకి ఎవ్వరూ చొరబడలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న నకిలీనోట్లు అత్యాధునిక ఫొటోకాపీల ద్వారా చేసినవే. నోట్ల సెక్యూరిటీ ఫీచర్లను దెబ్బతీసి, నకిలీనోట్లను ప్రవేశపెట్టడానికి ఇదివరకు విదేశాల్లో ప్రయత్నించిన సందర్భాలున్నాయి. వీటిలో సాధ్యం కాలేదు. మేం క్లీన్‌నోట్‌ పాలసీతోనే రూ.2వేల నోట్లను ఉపసంహరిస్తున్నాం మినహా, నకిలీల బెడద వల్ల కాదు.

ప్రశ్న:  తరచు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే, నగదు నిర్వహణపై ప్రజలకు అనుమానాలు రావా?

జవాబు: మన నగదు నిర్వహణ విధానం చాలా పటిష్ఠంగా ఉంది. డాలర్‌తో పోల్చినప్పుడు.. ఇతర కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి మారకపు విలువలో హెచ్చుతగ్గులు చాలా తక్కువగా ఉన్నాయి. కొత్త మహాత్మాగాంధీ సిరీస్‌ నోట్ల సెక్యూరిటీ ఫీచర్లు దెబ్బతినలేదు. మన కరెన్సీకున్న భద్రత కొనసాగుతుంది.

ప్రశ్న:  కొత్తగా రూ.1,000, లేదా మరే నోట్లను అయినా ప్రవేశపెడతారా?

జవాబు: అది పూర్తి ఊహాజనిత ప్రశ్న. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదనేదీ లేదు. వ్యవస్థలో ద్రవ్యలభ్యతను ఆర్‌బీఐ నిరంతరం పర్యవేక్షిస్తుంది. దానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటాం. గతవారమే రూ.46,400 కోట్లు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి ప్రవేశపెట్టాం.

ప్రశ్న:  వ్యవస్థలో 10% నోట్లను ఇప్పుడు ఉపసంహరిస్తున్నారు. దాన్ని భర్తీచేయడానికి కొత్తగా రూ.500, ఇతర నోట్లు ఎంతమేరకు

ముద్రించాల్సి ఉంటుంది?

జవాబు: ఇప్పటికే మన దగ్గర అవసరమైన దానికంటే ఎక్కువ నోట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కేవలం ఆర్‌బీఐ దగ్గరే కాకుండా బ్యాంకుల కరెన్సీ నిల్వ కేంద్రాల్లో ఉన్నాయి. అందువల్ల ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ప్రశ్న: ఒక్కోసారి మార్చుకోవడానికి గరిష్ఠంగా రూ.20 వేల వరకే ఎందుకు పరిమితి విధించారు.

జవాబు: 2005 నుంచి అమల్లో నోట్లను 2013-14లో ఉపసంహరించి, వాటి మార్పిడికి అవకాశం ఇచ్చాం. గరిష్ఠంగా అప్పుడూ ఒక్కోసారి 10 నోట్లు మార్చుకోవడానికే వీలు కల్పించాం. ఇప్పుడూ అదే పరిమితి కొనసాగించాం.

ప్రశ్న:  రూ.2000 నోట్లను స్థిరాస్తి, బంగారం కొనుగోళ్లకు వాడతారని భావిస్తున్నారా?

జవాబు: వాటి కొనుగోళ్ల గురించి నేనేమీ చెప్పలేను. అది ప్రజలపై ఆధారపడి ఉంటుంది. దేశంలోని వివిధ చోట్ల అనధికారికంగా నిర్వహించిన సర్వేల్లోనూ ‘సాధారణ లావాదేవీల్లో రూ.2,000 నోట్లు ఎక్కడా కనిపించడం లేద’ని తేలింది. అందువల్ల ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడదు.

ప్రశ్న:  ఇప్పటికీ రూ.2,000 నోటుతో సాధారణ వస్తువులు కొనుగోలు చేయొచ్చా? లేదా?

జవాబు: రూ.2,000 నోటు చెల్లుబాటవుతుంది. ఆ విషయం నోటిఫికేషన్‌లోనూ చెప్పాం. అయితే చిల్లర లేని కారణంగా ఎవరైనా తీసుకోకపోతే దాని గురించి ఏమీ వ్యాఖ్యానించలేం. అది ఆచరణలో వచ్చే సమస్య.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని