జెట్ ట్రైనర్ల ఒప్పందంలో అవినీతి!
భారత వాయుసేన, నౌకాదళానికి ‘హాక్-115’ అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్ (ఏజేటీ) శిక్షణ విమానాల కొనుగోలు వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ బ్రిటన్‌కు చెందిన ఆయుధ కంపెనీ రోల్స్ రాయిస్ పీఎల్‌సీపైన, ఆ సంస్థకు చెందిన భారత శాఖ ఉన్నతాధికారులపైన సీబీఐ కేసులు నమోదు చేసింది.
బ్రిటన్ సంస్థ రోల్స్ రాయిస్‌పై సీబీఐ కేసు
దిల్లీ: భారత వాయుసేన, నౌకాదళానికి ‘హాక్-115’ అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్ (ఏజేటీ) శిక్షణ విమానాల కొనుగోలు వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ బ్రిటన్‌కు చెందిన ఆయుధ కంపెనీ రోల్స్ రాయిస్ పీఎల్‌సీపైన, ఆ సంస్థకు చెందిన భారత శాఖ ఉన్నతాధికారులపైన సీబీఐ కేసులు నమోదు చేసింది. భారత శిక్షాస్మృతిలోని 120బి (నేరపూరిత కుట్ర), 420 (మోసం), అవినీతి నిరోధక చట్టంలోని పలు నిబంధనల కింద వీరిపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. 2016 డిసెంబరులో ప్రారంభించిన ప్రాథమిక విచారణ పూర్తయిన నేపథ్యంలో సీబీఐ ఈ చర్యను చేపట్టింది. రోల్స్ రాయిస్ ఇండియా డైరెక్టర్ టిమ్ జోన్స్, ఆయుధ విక్రేతలు సుధీర్ చౌధరి, ఆయన కుమారుడు భాను చౌధరితోపాటు రోల్స్ రాయిస్ పీఎల్‌సీ, బ్రిటిష్ ఏరోస్పేస్ (బీఏఈ) సిస్టమ్స్‌ను నిందితులుగా పేర్కొంది.
కాంట్రాక్టును సాధించడానికి రోల్స్ రాయిస్.. కమీషన్లు చెల్లించడం, మధ్యవర్తులను రంగంలోకి దించడం వంటి చర్యలకు పాల్పడినట్లు బ్రిటిష్ కోర్టు ఒకటి 2017లో తన ఉత్తర్వులో పేర్కొంది. ‘‘2003-12 మధ్య నిందితులు.. కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి కుట్ర పన్నారు. ఆ అధికారులు భారీ ముడుపులు తీసుకొని తమ అధికారాలను దుర్వినియోగం చేశారు. విమానాల కొనుగోళ్లకు పచ్చజెండా ఊపడం కోసం రోల్స్ రాయిస్ సంస్థ ఈ చెల్లింపులు చేసింది. మధ్యవర్తులను నియమించుకోవడం, కమీషన్లు చెల్లించడం వంటివి.. ఒప్పందం ప్రకారం నిషిద్ధమైనా ఈ చర్యకు పాల్పడింది’’ అని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
అరవై ఆరు హాక్-115 ఏజేటీల కొనుగోలుకు 2003 సెప్టెంబరు 3న భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) ఆమోదం తెలిపింది. దీనిప్రకారం 24 బీఏఈ హాక్-115వై ఏజేటీలను వినియోగానికి సిద్ధమైన దశలో సరఫరా చేయాలి. మిగతా 42 లోహవిహంగాలను లైసెన్సు కింద హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)లో ఉత్పత్తి చేస్తారు. రోల్స్ రాయిస్ కార్యకలాపాల్లో అవినీతి జరిగిందంటూ 2012లో వార్తలు వచ్చాయి. బ్రిటన్‌లోని తీవ్రమోసాల దర్యాప్తు విభాగం దీనిపై దృష్టిసారించింది. ఇండోనేసియా, మలేసియా, భారత్ వంటి దేశాలతో జరిగిన లావాదేవీల్లో ముడుపులు చెల్లించినట్లు రోల్స్ రాయిస్ తన ‘స్టేట్‌మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్’లో అంగీకరించింది. 2006 జనవరి 9న భారత్‌లోని తమ శాఖపై ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారని, ఆ సమయంలో మధ్యవర్తుల జాబితాను స్వాధీనం చేసుకున్నారని రోల్స్ రాయిస్ తెలిపింది. ఆ జాబితా రక్షణ శాఖ చేతికి వెళ్లకుండా ఐటీ అధికారులకు ముడుపులు చెల్లించారని బ్రిటన్ కోర్టు అప్పట్లో పేర్కొంది.
దర్యాప్తునకు సహకరిస్తున్నాం
రోల్స్ రాయిస్
సీబీఐ కేసు నమోదు చేయడంపై రోల్స్ రాయిస్ పీఎల్‌సీ సంస్థ లండన్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. దర్యాప్తులో భారత అధికారులకు తాము తోడ్పాటు అందిస్తున్నామని తెలిపింది. ‘‘సీబీఐ శోధిస్తున్న ఆరోపణలన్నీ.. 2017లో మేం బ్రిటన్ దర్యాప్తు సంస్థకు వెల్లడించినవే. నేడు రోల్స్ రాయిస్ తీరు భిన్నం. వ్యాపారంలో అవకతవకలను మేం ఉపేక్షించడంలేదు. అత్యున్నతస్థాయి నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాం. భారత్ మాకు చాలా ముఖ్యమైన మార్కెట్’’ అని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ