పెద్దనోట్ల రద్దుతో గల్ఫ్‌లో భారతీయులకు అవస్థ

భారతీయ రిజర్వు బ్యాంకు రూ.2,000 నోట్లను చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఇటీవల ప్రకటించడం గల్ఫ్‌ దేశాల్లోని భారతీయులకు పెద్ద సంకట పరిస్థితిని తెచ్చిపెట్టింది.

Published : 30 May 2023 05:23 IST

దుబాయ్‌: భారతీయ రిజర్వు బ్యాంకు రూ.2,000 నోట్లను చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఇటీవల ప్రకటించడం గల్ఫ్‌ దేశాల్లోని భారతీయులకు పెద్ద సంకట పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఈ నోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవడానికి, లేదా ఇతర నోట్లలోకి మార్చుకోవడానికీ సెప్టెంబరు 30 వరకు గడువు ఇచ్చినా గల్ఫ్‌ దేశాల్లోని బ్యాంకింగ్‌ సంస్థలు, విదేశీ మారకద్రవ్య మార్పిడి కేంద్రాలు ఆ విషయం తమకు తెలియదంటున్నాయి. నోట్ల మార్పిడికి నిరాకరిస్తున్నాయి. ఇది ప్రవాస భారతీయులకు, వారి కుటుంబాలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఇటీవల ఒక భారతీయ మహిళ దుబాయ్‌లోని తన భర్తతో వేసవి సెలవులు గడపడానికి ఇద్దరు పిల్లలతో వచ్చారు. ఆమె వద్ద ఎనిమిది 2,000 రూపాయల నోట్లు ఉన్నాయి. రిజర్వు బ్యాంకు ప్రకటన వినగానే ఆమె వాటిని స్థానిక కరెన్సీలోకి మార్చుకోవడానికి ఒక ఎక్స్ఛేంజి సెంటర్‌కు వెళ్లారు. దాని నిర్వాహకులు ఆ నోట్లను తీసుకోవడానికి నిరాకరించారు. నోట్ల మార్పిడికి భారత్‌ గడువు ఇచ్చిందని ఆమె చెబుతున్నా వారు వినిపించుకోలేదు. ఇతర గల్ఫ్‌ దేశాల్లో, సౌదీ అరేబియాలో కూడా 2,000 రూపాయల నోట్ల మార్పిడికి నిరాకరిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది భారత్‌ నుంచి వచ్చే హజ్‌ యాత్రికులు రూ.500 నోట్లను మాత్రమే తెచ్చుకోవాలనే సందేశం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని