పార్లమెంట్‌ రూపశిల్పి బిమల్‌

ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించే పార్లమెంట్‌ నూతన భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అట్టహాసంగా ప్రారంభించారు.

Published : 30 May 2023 05:23 IST

నూతన భవన ఆకృతి ఆయన సృష్టే  
హెచ్‌సీపీ సంస్థకు అధిపతి
విశ్వనాథ్‌ ధామ్‌, పూరీ ఆలయ బృహత్తర ప్రణాళిక ఆయన సంస్థదే

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించే పార్లమెంట్‌ నూతన భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అట్టహాసంగా ప్రారంభించారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ భవనాన్ని చెక్కిన శిల్పి ఎవరో తెలుసా..? ఆయనే ప్రముఖ ఆర్కిటెక్ట్‌ బిమల్‌ హస్ముఖ్‌ పటేల్‌.

పార్లమెంట్‌ కొత్త భవన రూపాన్ని డిజైన్‌ చేసిన గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్స్‌ సంస్థ యజమానే బిమల్‌ పటేల్‌. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన పటేల్‌ 1961 ఆగస్టు 31న జన్మించారు. ఆయన తండ్రి హస్ముఖ్‌ చందూలాల్‌ పటేల్‌ వాస్తుశిల్పి. ఆయన నుంచే ఆర్కిటెక్చర్‌ కళ బిమల్‌కు అబ్బింది. 1960లో చందూలాల్‌ హెచ్‌సీపీ సంస్థను ప్రారంభించారు. తండ్రికి తగ్గ వారసుడిగా బిమల్‌ పటేల్‌ కూడా ఇదే రంగంలోకి అడుగుపెట్టారు. అహ్మదాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌ అండ్‌ టెక్నాలజీలో ఆర్కిటెక్చరల్‌ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత  కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి రీజినల్‌ ప్లానింగ్‌లో పీహెచ్‌డీ సాధించారు. అదే యూనివర్సిటీకి 2012లో ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు.

త్రికోణ ఆకారం అందుకే..

  2019లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెంట్రల్‌ విస్టా పునర్నిర్మాణ ప్రాజెక్ట్‌లో హెచ్‌సీపీ డిజైన్స్‌ సంస్థ కన్సల్టెన్సీ బిడ్‌ను దక్కించుకుంది. అలా పార్లమెంట్‌ను డిజైన్‌ చేసే బాధ్యత బిమల్‌ పటేల్‌కు దక్కింది. దేశ అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలకు చిహ్నాంగా సరికొత్తగా పార్లమెంట్‌ భవనాన్ని ఆయన డిజైన్‌ చేశారు. ‘రైజింగ్‌ ఇండియా’ను ప్రతిబింబించేలా దీన్ని తీర్చిదిద్దామని బిమల్‌ తెలిపారు. పార్లమెంట్‌ కొత్త భవనాన్ని త్రికోణాకృతిలో తీర్చిదిద్దారు. దీని వెనుక ఓ ప్రత్యేక కారణం ఉందట. ‘‘దేశంలోని అన్ని సంస్కృతుల్లో త్రిభుజాలకు పవిత్ర ప్రాముఖ్యత ఉంటుంది. ఉదాహరణకు శ్రీయంత్రం, త్రిమూర్తులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. అందుకే ఆ నిర్మాణాన్ని ఎంచుకున్నాం. ఇక, లోక్‌సభ, రాజ్యసభ, సెంట్రల్‌ లాన్‌ ఇలా మూడు ప్రధాన భాగాలుగా పార్లమెంట్‌ను డిజైన్‌ చేశాం’’ అని బిమల్‌ పటేల్‌ ఓ సందర్భంలో తెలిపారు.

2019లో వరించిన పద్మశ్రీ

పార్లమెంట్‌తో పాటు బిమల్‌ పటేల్‌ ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు డిజైన్‌ చేశారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌, వారణాసిలోని కాశీ విశ్వనాథ్‌ ధామ్‌, పూరీలోని జగన్నాథ ఆలయ బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ ప్లానింగ్‌)ను రూపొందించింది ఆయన సంస్థే. తన ప్రతిభతో ఎన్నో అవార్డులు పొందారు. ఆయన సేవలకు గానూ.. 2019లో కేంద్ర ప్రభుత్వం బిమల్‌ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.


అఖండ భారత్‌ సంకల్పం సుస్పష్టం

పార్లమెంట్‌లో ఆసక్తికర మ్యాప్‌

దిల్లీ: పార్లమెంట్‌ నూతన భవనంలోని ఓ గోడపై ఉన్న మ్యాప్‌ ఆసక్తికరంగా మారింది. అది పురాతన భారతదేశాన్ని సూచించే విధంగా ఉంది. అందులో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న తక్షశిల, మరికొన్ని రాజ్యాలు కూడా ఉన్నాయి. ఈ మ్యాప్‌ను కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘సంకల్పం సుస్పష్టం.. అఖండ భారత్‌’ అంటూ జోషి ట్వీట్‌ చేశారు. ఈ అంశంపై కర్ణాటక భాజపా కూడా స్పందించింది. ‘ఇది మనం గర్వించదగిన గొప్ప నాగరికతకు చిహ్నం’అని తన ట్విటర్‌ హ్యాండిల్‌లో పేర్కొంది.అఖండ భారత్‌ భావన అనేది ప్రస్తుత అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, మయన్మార్‌, థాయ్‌లాండ్‌లతో కూడిన భౌగోళిక ప్రాంతంతో ఉన్న అవిభక్త భారతదేశాన్ని సూచిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని