సంక్షిప్త వార్తలు(4)

భారత్‌, చైనా మధ్య బుధవారం దిల్లీలో వ్యక్తిగత స్థాయిలో దౌత్య చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి మిగిలిన ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి సైనిక బలగాల ఉపసంహరణను స్పష్టమైన, పారదర్శక విధానంలో చేపట్టడం కోసం ప్రతిపాదనలపై ఇరు దేశాలు చర్చించాయి.

Updated : 01 Jun 2023 04:56 IST

భారత్‌, చైనా మధ్య దౌత్య చర్చలు

దిల్లీ: భారత్‌, చైనా మధ్య బుధవారం దిల్లీలో వ్యక్తిగత స్థాయిలో దౌత్య చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి మిగిలిన ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి సైనిక బలగాల ఉపసంహరణను స్పష్టమైన, పారదర్శక విధానంలో చేపట్టడం కోసం ప్రతిపాదనలపై ఇరు దేశాలు చర్చించాయి. భారత్‌-చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయ కార్యాచరణ దళం(డబ్ల్యూఎంసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన 27వ సమావేశం ఇది. సరిహద్దులో శాంతిని పునరుద్ధరించేందుకు సాధ్యమైనంత త్వరలో 19వ దశ ఉన్నత స్థాయి సైనిక చర్చలను నిర్వహించేందుకు ఇరు పక్షాలు అంగీకారానికి వచ్చినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. దౌత్య, సైనిక చర్చలు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది.


రూ.2వేల నోట్ల మార్పిడిపై సుప్రీంలో పిటిషన్‌

దిల్లీ: ఎటువంటి ధ్రువపత్రాల్లేకుండా రూ.2వేల నోట్ల మార్పిడికి అనుమతిస్తూ ఆర్‌బీఐ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టివేయడాన్ని పిటిషనరు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆర్‌బీఐ ఆదేశాలను న్యాయవాది అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ్‌ తొలుత దిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. ధ్రువపత్రాల్లేకుండా నోట్ల మార్పిడికి అనుమతిస్తే నల్లధనం అంతా తెల్లధనంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన దిల్లీ హైకోర్టు ధర్మాసనం మే 29న కొట్టేసింది. ఇందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో బుధవారం ఆ తీర్పును సుప్రీంకోర్టులో ఉపాధ్యాయ్‌ సవాలు చేశారు. రూ.2వేల నోట్లను నేరుగా మార్చుకోకుండా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు.


సురానా గ్రూప్‌నకు చెందిన రూ.124 కోట్ల ఆస్తుల ఎటాచ్‌

ప్యారిస్‌, న్యూస్‌టుడే: సురానా గ్రూపు సంస్థలకు చెందిన రూ.124 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఎటాచ్‌ చేసింది. చెన్నై కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థలకు దినేష్‌చంద్‌ సురానా, విజయ్‌రాజ్‌ సురానా తదితరులు డైరెక్టర్లుగా ఉన్నారు. వివిధ బ్యాంకుల నుంచి రూ.3,986 కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా ఈ గ్రూపు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ 2012లో సీబీఐ కేసు నమోదు చేసింది. రుణాలతో అక్రమంగా నగదు మార్పిడి చేసినట్లు ఈడీ కేసు పెట్టింది. రాహుల్‌ సురానా, దినేష్‌చంద్‌ సురానా, విజయ్‌రాజ్‌ సురానాలను అరెస్టు చేసింది. తాజాగా ఆస్తులను ఎటాచ్‌ చేసింది.


మోదీ సర్కారువి విధ్వంసక విక్రయాలు

మోదీ సర్కారు జాతీయ ఆస్తులు, ప్రభుత్వరంగ సంస్థలను నాశనం చేసి.. చివరకు వాటిని తమ మిత్రులైన పెట్టుబడిదారులకు ఇష్టారీతిన విక్రయిస్తోంది. ఇది అతిపెద్ద జాతి వ్యతిరేక చర్య. ఈ విధ్వంసక విక్రయాల వల్ల దేశంలో పేదలు, ఎస్సీ-ఎస్టీలు, ఓబీసీలు ఉపాధి అవకాశాలు కోల్పోయారు.

 మల్లికార్జున ఖర్గే


అంతటి జాప్యం మరే కేసులోనైనా ఉందా?

అదానీ గ్రూప్‌లోకి విదేశాల నుంచి వచ్చిన రెండు భారీ పెట్టుబడులపై ఆదాయపు పన్ను శాఖ దశాబ్ద కాలంగా దర్యాప్తు జరుపుతోంది. అందులో పురోగతి ఏమీ లేదు. ఈ వ్యవహారంలో చేసినంత జాప్యం ఇటీవలి కాలంలో ఆదాయపు పన్ను శాఖ మరే కేసులోనైనా చేసిందా? ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకున్న వ్యవహారాల్లో మాత్రం ఆ శాఖ తొలుత చర్యలు చేపట్టి.. ఆపై ‘ఆధారాలు’ సమర్పించింది. 

 ప్రియాంకా చతుర్వేది


ప్రజల జీవన నాణ్యతను మెరుగుపర్చేందుకే..

పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే ప్రగతి పథంలో ఎలా దూసుకెళ్లొచ్చో గత తొమ్మిదేళ్లలో ప్రపంచానికి భారత్‌ చూపించింది. 2014 నుంచి ఇప్పటివరకు మోదీ సర్కారు తీసుకున్న ప్రతి నిర్ణయం, చేపట్టిన ప్రతి చర్య లక్ష్యం.. ప్రజల జీవన నాణ్యతను మెరుగుపర్చడమే. 

 భాజపా


పొగాకుతో ఏటా 80 లక్షల ప్రాణాలు బలి

పొగాకు కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నారు. వారిలో దాదాపు 12 లక్షల మంది- ఇతరుల పొగ తాగే అలవాటుకు బలవుతున్నవారే.

 ఐక్యరాజ్య సమితి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని