Odisha Train Accident: కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయిన అభాగ్యులు ఎందరో?

అప్పటివరకు రైల్లో సరదాగా గడిపారు. పిల్లాపాపలతో కబుర్లు చెప్పుకుంటూ రాత్రి భోజనానికి సిద్ధమవుతున్న తరుణంలో ఒక్క ఉదుటున భారీ శబ్దం.

Updated : 04 Jun 2023 08:31 IST

పెద్ద పెద్ద శబ్దాలు.. గాల్లోకి ఎగిరిన బోగీలు
ఏం జరిగిందో తెలిసేలోపే చాలామంది మృత్యువాత
అంతా చీకటి.. హాహాకారాలు.. భయానక వాతావరణం
‘ఈనాడు’తో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాద బాధితులు

ఈనాడు-అమరావతి, విశాఖపట్నం: అప్పటివరకు రైల్లో సరదాగా గడిపారు. పిల్లాపాపలతో కబుర్లు చెప్పుకుంటూ రాత్రి భోజనానికి సిద్ధమవుతున్న తరుణంలో ఒక్క ఉదుటున భారీ శబ్దం. అంతే సీట్లలో కూర్చున్న వారంతా ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. ఏమైందో తెలియలేదు.. ఎవరెక్కడ ఉన్నారో కనిపించలేదు. చుట్టూ చీకట్లు.. భయానక వాతావరణం. ఎటుచూసినా హాహాకారాలే. అప్పటి వరకూ తల్లుల ఒడిలో కూర్చొని ఆడుకున్న పిల్లలు కనిపించలేదు. పక్కనే ఉన్న వారికి ఏమైందో తెలియడం లేదు. ఇదీ ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం నుంచి చిన్నపాటి గాయాలతో బయటపడిన వారి అనుభవం. వీరంతా ఘోర ప్రమాదానికి గురైన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లోనే ప్రయాణించినా అదృష్టవశాత్తూ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఘటనా స్థలం నుంచి చెన్నైకి బయలుదేరిన ప్రత్యేక రైలులో శనివారం మధ్యాహ్నం పలువురు విశాఖకు చేరుకున్నారు. మరికొందరు స్వస్థలాలకు ప్రయాణమయ్యారు. ‘ప్రమాద దృశ్యం చూసి గుండె ఆగినంత పనైంది. ఎన్నడూ ఇలాంటి ఘటనలు చూడలేదు. ఎంత మంది చనిపోయారో.. ఎంతమంది బతికారో.. కుటుంబ సభ్యులు ఏమయ్యారో తెలియక చాలామంది విలపిస్తూ కనిపించార’ని ఆయా ప్రయాణికులు ‘ఈనాడు-ఈటీవీ’తో పేర్కొన్నారు.


జనరల్‌ బోగీలో 30 మంది మృతి

‘బతుకుతెరువు కోసం బిహార్‌ నుంచి చెన్నైకి వెళ్తున్నాం. కోరమాండల్‌ జనరల్‌ బోగీలో ప్రయాణిస్తున్నా. నాతో పాటు 100 మందికి పైగా అందులో ఉన్నారు. వీరిలో 30 మంది వరకు మృతి చెందారు. బోగీలో ఇరుక్కుపోయిన నన్ను సహాయక బృందాలు, స్థానికులు బయటకు లాగారు. కాలికి చిన్నపాటి గాయంతో బయటపడ్డా’.


టీసీల ప్రవర్తన దారుణం

- ఫిలిప్‌, తెనాలి, గుంటూరు జిల్లా

‘ఎటు చూసినా మృతదేహాలే.. ఏం చేయలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. అసలు అక్కడి నుంచి ఎలా బయట పడతామో అర్థం కాలేదు. రైల్వే అధికారులు స్పందించి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కించారు. ఒడిశా వరకు ప్రశాంతంగా వచ్చాం. వైజాగ్‌లో టీసీలు వచ్చి సీట్లలో కూర్చోవద్దని హెచ్చరించారు. చేసేది లేక మరుగుదొడ్ల వద్ద నిలబడాల్సి వచ్చింది. ప్రాణాలలో బయటపడిన మాకు టీసీల ప్రవర్తన చాలా ఇబ్బంది పెట్టింది’


50 మందిని బయటకు తెచ్చాం

- కె.లోకేశ్వరరావు, మధురవాడ, విశాఖ

‘పండగకని గత నెల 22న కోల్‌కతాలోని సోదరుడి ఇంటికి అయిదుగురు కుటుంబ సభ్యులం వెళ్లాం. తిరిగి విశాఖపట్నం వచ్చేందుకు శుక్రవారం కోరమాండల్‌లో బయలుదేరాం. మేం బి-5 కోచ్‌లో ఎక్కాం. రాత్రి రైలు దేనినో గుద్దుకున్నట్లు అనిపించింది. తరువాత ఏమీ తెలియలేదు. చుట్టూ అంధకారం. ఎటు చూసినా గాయపడిన వారి అరుపులు, కేకలే. మేమంతా రైలు కింద ఉన్నట్లు గుర్తించాం. ఏం చేయాలో తెలియలేదు. మా పిల్లలు ఎక్కడున్నారో కనిపించలేదు. నెమ్మదిగా తేరుకొని ఏసీ గ్లాసులు ఉన్న వైపు వెళ్లి వాటిని పగలగొట్టే ప్రయత్నం చేశాం. ఎంత ప్రయత్నించినా కుదరలేదు. అంతలో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వారి సహకారంతో అద్దాలు పగలగొట్టాం. మా పిల్లలు, అమ్మ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నా భార్య తలకి తీవ్ర గాయమైంది. స్థానికుల సాయంతో సుమారు 50 మందిని బయటకు తెచ్చాం.’  


బతికే ఉన్నామా అనిపిస్తోంది.. 

- లక్ష్మీ బిశ్వాస్‌, కృష్ణా జిల్లా 

‘మాది పశ్చిమ బెంగాల్‌. కృష్ణా జిల్లా పెడనలో స్థిరపడ్డాం. సెలవులకని పిల్లలతో కలిసి సొంతూరు కోల్‌కతా వెళ్లాం. తిరుగు ప్రయాణంలో ఇద్దరు పిల్లలతో కలిసి కోరమాండల్‌ బి-6 బోగీలో ఎక్కాం. ప్రమాదం జరగ్గానే మేం ఒక్కసారిగా ముందుకు పడిపోయాం. బోగీ పల్టీ కొట్టి పూర్తిగా తలకిందులైంది. ఆ ప్రాంతమంతా వేడిగా అనిపించింది. అంతా గాఢాంధకారం. చీకట్లో ఏమీ తెలియలేదు. ఫోన్‌ దగ్గరే ఉండడంతో పిల్లల కోసం వెతికా. వాళ్లిద్దరూ చాలా దూరంలో పడి ఉన్నారు. అతి కష్టం మీద వారిని గుర్తించా. ఈ సమయంలో చాలా భయానక పరిస్థితిని చూశా. అప్పటికే కొందరు మృతిచెంది ఉన్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కిటికీ లోపల నుంచి బయటకు దూకి బయటపడ్డాం. పిల్లలిద్దరికీ వీపు మీద చేతులకు, తలకు గాయాలయ్యాయి. అక్కడి తీవ్రతను చూస్తే ఇప్పటికీ బతికున్నామా అనిపిస్తుంది.’


ఊహించని ఘోరం

- శంకరరావు, విశాఖ

‘నేను కోల్‌కతాలో పనిచేస్తున్నాను. విజయవాడ వెళ్లాల్సి ఉన్నందున సెలవు పెట్టి కోరమాండల్‌లో నేనొక్కడినే కోల్‌కతా నుంచి వస్తున్నా. అప్పుడే టిఫిన్‌ చేసి పడుకుందామనుకునే సమయంలో ఘోరం జరిగిపోయింది. నాకు స్పృహ పోయింది. చాలాసేపు బోగీలోనే పడి ఉన్నా. టార్చ్‌ వెలుతురు కనిపిస్తున్నా లేవలేకపోతున్నా. బోగీలోని వారంతా సాయం కోసం అరిచారు. శరీర భాగాలు తెగిపడిన వారు అక్కడే పడి ఉండిపోయారు. మా బోగీలోకి వేరే బోగీ చొచ్చుకొచ్చింది. లోపలంతా ధ్వంసమైంది. స్థానికుల సాయంతో బయటపడిన నాకు అక్కడే ప్రాథమిక చికిత్స చేసి తలకు కట్టుకట్టారు. ప్రత్యేక రైలులో విశాఖ వచ్చా.’

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని