Odisha Train Accident: ట్రాక్‌ మారడంతోనే ‘ఘోరం!’

ఒడిశాలో బాలేశ్వర్‌ సమీపంలోని బహానగాబజార్‌ స్టేషన్‌ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనకు ముఖ్య కారణం.. ప్రధాన లైన్‌లో వెళ్లాల్సిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, ఆకస్మికంగా లూప్‌లైన్‌లోకి దూసుకెళ్లి అక్కడున్న గూడ్స్‌ను ఢీకొనడమేనని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.

Updated : 04 Jun 2023 08:10 IST

చివరి క్షణాల్లో అనూహ్యంగా లూప్‌లైనులోకి కోరమాండల్‌
ప్రమాద సమయంలో గంటకు 130 కి.మీ.వేగం
సిగ్నలింగ్‌ లోపాలపైనే అనుమానాలు
రైల్వే ప్రాథమిక నివేదిక

ఈనాడు-అమరావతి: ఒడిశాలో బాలేశ్వర్‌ సమీపంలోని బహానగాబజార్‌ స్టేషన్‌ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనకు ముఖ్య కారణం.. ప్రధాన లైన్‌లో వెళ్లాల్సిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, ఆకస్మికంగా లూప్‌లైన్‌లోకి దూసుకెళ్లి అక్కడున్న గూడ్స్‌ను ఢీకొనడమేనని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి అధికారులు శనివారం ప్రాథమిక నివేదిక రూపొందించారు. దీనిప్రకారం షాలీమార్‌ నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటకు 128-130 కి.మీ.వేగంతో ప్రయాణిస్తోంది. దానికి ముందే బహనగాబజార్‌ స్టేషన్‌ వద్దకు వచ్చిన గూడ్స్‌ రైల్‌ను లూప్‌లైన్‌లో నిలిపి ఉంచారు. దీంతో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌.. మెయిన్‌ లైన్‌లో వెళ్లేలా సిగ్నల్‌ ఇచ్చారు. అయితే అనూహ్యంగా కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ లూప్‌ లైన్‌లోకి దూసుకెళ్లి, అక్కడ ఆగివున్న గూడ్స్‌ను బలంగా ఢీకొంది. దీంతో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలు నుజ్జు కావడంతోపాటు, మొత్తంగా 14 బోగీల్లో కొన్ని బోల్తాపడగా, మరికొన్ని పక్కన ఉన్న మరో మెయిన్‌ లైన్‌ (డౌన్‌ లైన్‌)పై పడ్డాయి. అదే సమయంలో గంటకు 125-130 కి.మీ. వేగంతో యశ్వంత్‌పూర్‌-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ డౌన్‌ మెయిన్‌ లైన్‌లోకి వచ్చి, ఢీకొంది. దీంతో దాని రెండు బోగీలు కూడా బోల్తాపడ్డాయి. దీనివల్ల భారీగా ప్రాణనష్టం జరిగింది.

సిగ్నలింగ్‌లో ఏమైంది?

రైళ్ల రాకపోకలకు సిగ్నలింగ్‌ వ్యవస్థ కీలకమైనది. సిగ్నల్‌ పాయింట్ల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఒక రైలును మెయిన్‌ లైన్‌ నుంచి లూప్‌లైన్‌లోకి పంపిన తర్వాత, ఆ సిగ్నల్‌ పాయింట్లను ఆటోమెటిక్‌గా ఆల్ట్రెక్‌ చేసి (లాక్‌చేసి), సెట్‌ అగైనెస్ట్‌ (మరో రైలు రాకుండా) చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వెంటనే నిమిషాల వ్యవధిలో ఆ పాయింట్లను మెయిన్‌ లైన్‌కు పెట్టి, దానిమీదుగా మరో రైలు వెళ్లేందుకు సిగ్నల్‌ ఇస్తారని పేర్కొంటున్నారు. ఇందులో ఏదైనా లోపం జరగడం వల్ల మెయిన్‌ లైన్‌లో వెళ్లాల్సిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, లూప్‌లైన్‌లోకి వెళ్లిఉంటుందని అంచనావేస్తున్నారు. సాధారణ స్థితిలోనే రెండు (అప్‌, డౌన్‌) మెయిన్‌ లైన్లలో కోరమండల్‌, యశ్వంత్‌పూర్‌-హావ్‌డా సూపర్‌ ఫాస్ట్‌లకు స్టేషన్‌ మాస్టర్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్యానెల్‌ రూట్‌ చూపిస్తున్నట్లుగా అధికారుల నివేదికలో పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనతో అక్కడి పాయింట్‌-16బి, 17ఎ, 17బితోపాటు, లొకేషన్‌ బాక్స్‌-3, పాయింట్‌ ట్రాక్‌ జంక్షన్‌ బాక్స్‌లు, సిగ్నల్‌ పోస్టు పూర్తిగా ధ్వంసమైనట్లు ఉంది.

కేవలం 9 సెకన్లలోనే ఆగింది

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటకు 130 కి.మీ. వేగంతో వెళ్తూ, గూడ్స్‌ రైలును ఢీకొన్నాక.. కేవలం 9 సెకన్లలోనే దాని వేగం 0 కి.మీకు వచ్చింది. ఆ వేగం 0 కి.మీకు చేరాలంటే కనీసం 60 సెకన్లు (నిమిషం) పడుతుందని, కానీ 9 సెకన్లే పట్టిందంటే ప్రమాద తీవ్రత అర్థమవుతుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

ఏమిటీ లూప్‌లైన్‌..?

రైల్వే అధికారుల సమాచారం ప్రకారం.. స్టేషన్‌ ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలను సులభతరం చేసేందుకు ఈ లూప్‌లైన్లను నిర్మిస్తారు. ఈ లూప్‌లైన్ల పొడవు 750 మీటర్లు ఉంటుంది. మల్టిపుల్‌ ఇంజిన్లు ఉండే ఒక గూడ్స్‌ రైలు ఆగేందుకు వీలుగా వీటిని నిర్మిస్తారు. సాధారణంగా.. సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లకు లూప్‌లైన్‌లోకి వెళ్లేందుకు సిగ్నల్‌ ఇచ్చేప్పుడు..హైస్పీడ్‌లో వెళ్లే విధంగా నీలిరంగు సిగ్నల్‌ కాకుండా నెమ్మదిగా వెళ్లే విధంగా సిగ్నల్‌ ఇస్తారు. అయితే, ఇక్కడ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మెయిన్‌లైన్లోకి వెళ్లేందుకు సిగ్నల్‌ ఇచ్చినా లూప్‌లైన్‌లోకి ఎలా వచ్చిందన్న దానిపై రైల్వే శాఖ దర్యాప్తు చేపట్టింది.


అంతా క్షణాల్లో జరిగిపోయింది..

బాలేశ్వర్‌: శుక్రవారం సాయంత్రం..

6.50 గంటలకు:  ఒడిశాలోని బహానగా బజార్‌ స్టేషన్‌ సమీపంలోని లూప్‌లైన్లో ఆగి ఉన్న గూడ్సురైలు పైకి దూసుకెళ్లిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌. బోగీలు పట్టాలు తప్పి కోరమాండల్‌లోని ప్రయాణికుల హాహాకారాలు.

6.55: ఏం జరిగిందో అర్థంకాని అయోమయం. అంతలోనే పక్కనున్న మార్గంలో ఎదురుగా దూసుకొచ్చిన బెంగళూరు - హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ రైలు. పట్టాలు తప్పి పక్కనపడ్డ కోరమాండల్‌ బోగీలతో ఢీ.. అనూహ్య విధ్వంసం!

7.10: చిన్న పల్లెటూర్లో మిన్నంటిన ఆర్తనాదాలు. పరుగెత్తుకొచ్చిన స్థానికులు.. సహాయక చర్యలు షురూ.

7.30: స్థానిక అధికారులు, పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది ఘటనాస్థలికి రాక.

8.00 - 9.00: తూర్పు రైల్వే బి.ఆర్‌.సింగ్‌ ఆసుపత్రి నుంచి భారీస్థాయిలో వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది రాక.

9.30: స్వల్పగాయాలతో బయటపడ్డవారిని బస్సుల్లో తరలించడం ఆరంభం.

శనివారం ఉదయం నుంచి..

* ప్రమాద స్థలానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రాక. దుర్ఘటనపై అత్యున్నతస్థాయి విచారణకు ఆదేశం.

* ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ రాక.

* దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష.

* ప్రమాద స్థలికి చేరుకున్న బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

* భువనేశ్వర్‌ ఎయిమ్స్‌ నుంచి వైద్యుల రాక.

* దుర్ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోదీ. ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ.


లోతుగా విచారించాలి: మర్రి రాఘవయ్య

ఈనాడు, దిల్లీ: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెసే కారణమని నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వేమెన్‌ (ఎన్‌ఎఫ్‌ఐఆర్‌) ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య పేర్కొన్నారు. శనివారం ఆయన ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ‘‘కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు మెయిన్‌లైన్‌లో సిగ్నల్స్‌ ఉన్నప్పటికీ లూప్‌లైన్‌లోకి ఎలా ప్రవేశించిందన్నది అంతుచిక్కని ప్రశ్న. పాయింట్‌ చెక్‌ క్రాసింగ్స్‌లో ఏదైనా లోపం జరిగిందా? సాంకేతిక లోపముందా? లేదంటే మానవ వైఫల్యమా?అన్నది చూడాలి. వాస్తవానికి రెండు ఎక్స్‌ప్రెస్‌లైన్లు స్టేషన్‌లో మెయిన్‌లైన్‌లోనే ఉన్నాయి. అవి ఒకే సమయంలో స్టేషన్‌ నుంచి వెళ్లే తరుణంలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ లూప్‌లైన్‌లోకి ఎలా వెళ్లింది? దీనిపై లోతుగా విచారించాలి’’ అని ఆయన కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని