మాటల వర్షమే!.. నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

కొత్త మిత్రులు, సరికొత్త పొత్తులతో అధికార, విపక్ష కూటములు బలాన్ని కూడదీసుకుంటున్న తరుణంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.

Published : 20 Jul 2023 05:54 IST

అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్న ఎన్డీయే, ఇండియా కూటములు
మణిపుర్‌ మారణకాండ, దిల్లీ ఆర్డినెన్సు, యూసీసీలపై దద్దరిల్లే అవకాశం!
అఖిలపక్ష సమావేశంలోనే కనిపించిన సంకేతాలు

ఈనాడు, దిల్లీ: కొత్త మిత్రులు, సరికొత్త పొత్తులతో అధికార, విపక్ష కూటములు బలాన్ని కూడదీసుకుంటున్న తరుణంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరస్పరం ఇరుకునపెట్టే వ్యూహాలకు రెండు శిబిరాలూ పదును పెడుతున్నాయి. ముఖ్యంగా మణిపుర్‌ అల్లర్లపై ప్రధాని నరేంద్రమోదీ ఇంతవరకు ఒక్కసారి కూడా స్పందించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ), దిల్లీ ఆర్డినెన్సు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, మహిళా రిజర్వేషన్లు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, రైల్వే భద్రత, సరిహద్దులో పరిస్థితులు వంటి ఇతర అంశాలూ చర్చకు వచ్చేలా చూడాలని, దానిపై వ్యూహరచనకు ప్రతిరోజూ సమావేశం కావాలని ప్రతిపక్ష శిబిరం నిర్ణయించింది. ఆగస్టు 11 వరకు మొత్తం 17 పనిదినాల్లో కొనసాగే సమావేశాల్లో 32 అంశాలను సభల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. తొలిరోజు నుంచే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దిల్లీ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌, టీఎంసీ, డీఎంకే సభ్యులు సమర్పించిన నోటీసులను లోక్‌సభ సచివాలయం అనుమతించింది. కొత్తగా ఏర్పాటైన విపక్ష కూటమి ‘ఇండియా’- గురువారం తొలిసారి సమావేశం కానుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని చర్చించడానికి రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో దీనిని నిర్వహించనున్నారు.

అఖిలపక్షంలో డిమాండ్లు వెల్లడి

ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. ఉభయసభలను సజావుగా నిర్వహించాలన్న ఉద్దేశంతో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం బుధవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. 34 పార్టీల నేతలు హాజరై తమ డిమాండ్లను వినిపించారు. మణిపుర్‌ పరిస్థితులపై మొదటిరోజే ప్రధానమంత్రి ప్రకటన చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కులగణన, ధరల పెరుగుదల, నిరుద్యోగంలాంటి అంశాలపై చర్చ గురించి వివిధ పార్టీలు డిమాండ్‌ చేశాయి. ప్రతి అంశంపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి చెప్పారు. మణిపుర్‌ అంశంపై చర్చకు సభాపతి ఎప్పుడు తేదీ నిర్ణయిస్తే అప్పుడు చర్చిస్తామని, ప్రధానమంత్రి ప్రకటన కోసం విపక్షాలు డిమాండ్‌ చేయడం సభలో గందరగోళం సృష్టించడానికి ఒక సాకు మాత్రమేనని చెప్పారు.

..ఆ ఆర్డినెన్సులను వ్యతిరేకిస్తాం: కాంగ్రెస్‌

పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభ రోజే.. మణిపుర్‌ అంశంపై వాయిదా తీర్మానం ఇస్తామని కాంగ్రెస్‌ తెలిపింది. మణిపుర్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు ఏం చేయాలనుకుంటున్నారన్నది పార్లమెంటు ద్వారా దేశ ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్‌ డిమాండ్‌ చేశారు. చైనా దురాక్రమణకు పాల్పడుతున్నా ప్రధానమంత్రి ఆ దేశానికి క్లీన్‌చిట్‌ ఇస్తున్నారని విమర్శించారు. అటవీ సంరక్షణ సవరణ చట్టం, జీవవైవిధ్య బిల్లు, దిల్లీ ఆర్డినెన్స్‌లను వ్యతిరేకించబోతున్నట్లు వెల్లడించారు. సభ సజావుగా జరిగేలా చూసుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. వాజ్‌పేయీ, మన్మోహన్‌సింగ్‌, పీవీ నరసింహారావు సర్కారుల్లో ఏ అంశంపైనైనా చర్చలు సాగేవని, ఏదీ ఏకపక్షంగా, నిరంకుశంగా ఉండేది కాదని వివరించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలని భారాస, వైకాపా కోరాయి. లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా బుధవారం లోక్‌సభాపక్ష నేతలతో సమావేశమై.. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు.

కొత్తపేరుతో ఒరిగేదేమీ లేదు: ప్రధాన్‌

విపక్ష కూటమి పాత వాసనలు వదులుకోకుండా కొత్తపేరు పెట్టుకున్నంతమాత్రాన మారేదేమీ ఉండదని భాజపా ఎద్దేవా చేసింది. దేశంపట్ల ఆలోచనతీరును, ఉద్దేశాలను మార్చుకుంటే మేలని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ సూచించారు. ఇండియా కూటమి పది తలల రావణుడితో సమానమని భాజపా పేర్కొంది. ముందుచూపుతో, నిర్ణయాత్మక అడుగులు వేసే సామర్థ్యం ఇంతమంది భాగస్వాములున్న కూటమికి ఉండదని ట్వీట్‌ చేసింది. ఆ కూటమి నేత ఎవరని ప్రశ్నించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని