దిల్లీలో ఆప్‌, భాజపా నేతల నిరసన

దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ ఆప్‌ నేతలు చేపట్టిన ప్రధాని మోదీ నివాసం ముట్టడిలో ఉద్రిక్తత నెలకొంది.

Published : 27 Mar 2024 04:23 IST

పలువురిని అరెస్టు చేసిన పోలీసులు

దిల్లీ: దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ ఆప్‌ నేతలు చేపట్టిన ప్రధాని మోదీ నివాసం ముట్టడిలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆప్‌ సీనియర్‌ నాయకుడు సోమనాథ్‌ భారతి, దిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రాఖీ బిర్లా, పంజాబ్‌ మంత్రి హర్జోత్‌సింగ్‌ బేన్స్‌ తదితర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందోళనకారులను అడ్డుకునేందుకు మోదీ నివాసం చుట్టూ పలు అంచెల్లో పోలీసులు మోహరించారు. అటువైపు ఎవరూ రాకుండా 144 సెక్షన్‌ విధించారు. దిల్లీలోని పటేల్‌ చౌక్‌ మెట్రో స్టేషన్‌ వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. అలాగే మూడు మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేశారు. కేజ్రీవాల్‌కు సంఘీభావంగా మంగళవారం హరియాణాలోని భాజపా కార్యాలయం ముంగిట ఆప్‌ మద్దతుదారులు ఆందోళనలకు దిగారు.

57 మంది భాజపా నాయకులూ..

ఇదిలా ఉండగా మరోవైపు కేజ్రీవాల్‌ సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ భాజపా కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు దిల్లీలోని పటేల్‌ చౌక్‌ మెట్రో స్టేషన్‌, ఫిరోజ్‌ షా కోట్లాలో నిరసలు చేపట్టారు. బారికేడ్లను తొలగించేందుకు యత్నించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవాతో సహా 57మంది పార్టీ నాయకులను అరెస్టు చేశారు.

పారదర్శక విచారణను ప్రోత్సహిస్తాం: అమెరికా

కేజ్రీవాల్‌ అరెస్టుపై అమెరికా స్పందించింది. భారత్‌లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఈ అంశంపై ఇటీవల జర్మనీ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానిపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి..ఆ దేశ రాయబార కార్యాలయం డిప్యూటీ హెడ్‌ జార్జ్‌ ఎంజ్‌వీలర్‌ వద్ద తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేంటని మండిపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని