Booster Dose: భారత్‌లో ‘బూస్టర్‌ డోసు’ అవసరం ఉందా..?లేదా..?

రోజుకు రోజుకు కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్నవారు వెంటనే బూస్టర్‌ డోసు వేసుకోవాలని కొందరు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. బూస్టర్‌ డోసు ద్వారా ఒమిక్రాన్‌ తీవ్రత నుంచి రక్షణ కలుగుతుందని

Updated : 24 Dec 2021 16:01 IST

అధ్యయనం జరిపించనున్న కేంద్రం!

దిల్లీ: రోజుకు రోజుకు కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్నవారు వెంటనే బూస్టర్‌ డోసు వేసుకోవాలని కొందరు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. బూస్టర్‌ డోసు ద్వారా ఒమిక్రాన్‌ తీవ్రత నుంచి రక్షణ కలుగుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దేశంలో బూస్టర్‌ డోసు అవసరం ఎంతమేర ఉందో తెలుసుకోవడం కోసం అధ్యయనం చేపట్టాలని భావిస్తోందని, ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌(టీహెచ్‌ఎస్‌టీఐ) నేతృత్వంలో పలు పరిశోధనల సంస్థలు ఈ అధ్యయాన్ని చేపట్టనున్నట్లు ఓ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది.

అధ్యయనంలో భాగంగా ఆరు నెలల కిందట వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్న 3 వేల మంది ఆరోగ్య పరిస్థితిని పరిశోధకులు విశ్లేషించనున్నారు. ఇందుకోసం కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిని ఎంపిక చేశారు. ‘‘రెండో డోసు పూర్తిచేసుకున్న వ్యక్తుల్లో ఆరు నెలల తర్వాత రోగనిరోధక శక్తి సామర్థ్యం ఎలా ఉందో తెలుసుకుంటాం. ఈ క్రమంలో యాంటీ-బాడీలు, టీ.. బీ కణాల ప్రతిస్పందన ఏ విధంగా ఉందో విశ్లేషిస్తాం. ఈ అధ్యయనం ద్వారా దేశంలో బూస్టర్‌ డోసు అవసరం ఉందా..? లేదా? అనే అంశంపై స్పష్టత వస్తుంది’’అని పరిశోధక వర్గాలు వెల్లడించాయి. త్వరలో ఈ పరిశోధక బృందం ‘బూస్టర్‌ డోసు’ అధ్యయనంపై చర్చించేందుకు నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌(ఎన్‌టీఈజీఐ)ని కలవబోతున్నట్లు సమాచారం.

అధ్యయనం ఎలా చేస్తారు?

ఈ అధ్యయనం కోసం 3 వేల మందిని.. 40 ఏళ్లుపైబడిన వ్యక్తులు - 40 ఏళ్లలోపు వ్యక్తులు - వ్యాక్సినేషన్‌కు ముందు కరోనా బారిన పడిన వారు - ఇప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతూ కరోనా సోకిన వారు.. ఇలా నాలుగు వర్గాలుగా విభజించనున్నారు. వీరి ఆరోగ్య చరిత్ర, వ్యాక్సినేషన్‌ వివరాలు తెలుసుకొని.. రక్త నమూనాలు సేకరిస్తారు. వాటిపై పరిశోధన చేసి నివేదిక రూపొందిస్తారు. దీని ఆధారంగా కేంద్రం బూస్టర్‌ డోసు అవసరంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముంది.

Read latest National - International News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని