Cabinet:మరో ఇద్దరు కేంద్రమంత్రుల రాజీనామా

కేంద్ర కేబినెట్‌ విస్తరణ జరగనున్న వేళ కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరికొన్ని గంటల్లోనే కేబినెట్‌ విస్తరణ జరగనుండగా కేంద్ర వైద్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ సహా ఇప్పటివరకు.....

Updated : 07 Jul 2021 18:07 IST

దిల్లీ: కేంద్ర కేబినెట్‌ విస్తరణ నేపథ్యంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా మరో ఇద్దరు కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పటికే కేంద్ర వైద్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ సహా 10 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయగా.. తాజాగా రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్ జావడేకర్‌ రాజీనామా చేశారు. కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణతో చోటుచేసుకున్న మార్పుల్లో భాగంగా రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్ జావడేకర్‌, డాక్టర్‌ హర్షవర్దన్‌, రమేశ్‌ పోఖ్రియాల్‌, సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌, సదానందగౌడతో పాటు రతన్‌లాల్‌ కటారియా, దేవశ్రీ చౌధురి, సంజయ్‌ ధోత్రే, రావు సాహెబ్‌ ధన్వే పాటిల్‌, అశ్వినీ చౌబే, బాబుల్‌ సుప్రియోలకు ఉద్వాసనకు గురయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ సిఫారసు మేరకు వీరి రాజీనామాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు.

కేంద్ర న్యాయ, ఐటీశాఖ మంత్రిగా ఉన్న రవిశంకర్‌ ప్రసాద్‌ ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టంపై ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాలతో తలపడిన విషయం తెలిసిందే. అలాగే, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి, ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉన్న ప్రకాశ్‌ జావడేకర్‌ రాజీనామాను పెద్ద సర్‌ప్రైజ్‌గానే రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు, కరోనా సెకండ్‌వేవ్‌ను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యంపై గతంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, పడకల కొరతతో పాటు వ్యాక్సినేషన్‌ విధానంపైనా విమర్శలు వచ్చిన నేపథ్యంలో హర్షవర్దన్‌ తాజాగా తన మంత్రి పదవికి రాజీనామా చేయడం గమనార్హం. అయితే, ఆరోగ్యశాఖ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే, అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకొంటున్నట్టు రమేశ్‌ పోఖ్రియాల్‌ స్పష్టంచేశారు. కొత్తగా 43మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనుండగా.. ఎవరెవరికి ఏయే మంత్రిత్వశాఖలు కేటాయిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని