pak: భారత సరిహద్దుల్లో పాక్‌ సెల్‌ టవర్లు..!

భారత సరిహద్దుల్లో పాక్‌ నిర్మించిన సెల్‌ టవర్లు ఆందోళనకరంగా మారాయి. ఇటీవల జమ్ములో డ్రోన్‌ దాడి జరగడంతో ఇప్పుడు సెల్‌ టవర్లు మన భధ్రతా సంస్థలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Published : 07 Jul 2021 11:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత సరిహద్దుల్లో పాక్‌ నిర్మించిన సెల్‌ టవర్లు ఆందోళనకరంగా మారాయి. ఇటీవల జమ్ములో డ్రోన్‌ దాడి జరగడంతో ఇప్పుడు సెల్‌ టవర్లు మన భధ్రతా సంస్థలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జమ్ము దాడి నేపథ్యంలో నిన్న హోంశాఖ కీలక అధికారులు దిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా భారత సరిహద్దుల్లో పాక్‌ సెల్‌ టవర్‌ నిర్మించి మొబైల్‌ నెట్‌వర్క్‌ను బలపర్చడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెట్‌వర్క్‌ సరిహద్దు ప్రాంతాలతో పాటు.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో కూడా పనిచేస్తుంది. ఈ సమావేశానికి హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అధ్యక్షత వహించారు.

భారత్‌లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకే..

కొన్నేళ్ల నుంచి భారత్‌లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు పాక్‌ వివిధ మార్గాల్లో యత్నాలు చేస్తోంది. కశ్మీర్‌లో గొడవలు లేదా ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్లు జరుగుతుంటే ప్రభుత్వం అక్కడ ఇంటర్నెట్‌ను నిలిపివేస్తుంది. ఇటువంటి సమయంలో పాక్‌ ఏర్పాటు చేసిన టవర్లు ద్వారా దేశ వ్యతిరేక శక్తులకు ఇంటర్నెట్‌ సేవలు అందే ప్రమాదం ఉంది. ఇమ్రాన్‌ సర్కారు వచ్చాక సరిహద్దులు.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో దాదాపు 38 చోట్ల హైసిగ్నల్‌ సెల్‌ టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఇవి భారత్‌ ప్రభుత్వం ఇంటర్నెట్‌ నిలిపివేసిన సమయంలో కశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాలకు కూడా సిగ్నల్స్‌ను అందిస్తుంది. పాకిస్థాన్‌ స్పెషల్‌ కమ్యూనికేషన్‌ ఆర్గనైజేషన్‌ ఈ పనులను చూస్తోంది. ఇదే సంస్థ పీవోకే, గిల్గిత్‌ బాల్టిస్థాన్‌లలో కూడా కమ్యూనికేషన్లను నిర్వహిస్తుంది. దీంతోపాటు భారత్‌లోని జమ్ము, కశ్మీర్‌ ప్రాంతాలకు పాక్‌ టీవీల నుంచి సిగ్నల్స్‌ అందేలాగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్‌ వ్యతిరేక ప్రచారానికి వీటిని వాడుకొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని