Dharavi Model: సెకండ్‌ వేవ్‌ని జయిస్తోన్న ధారావి!

దేశంలో అతిపెద్ద మురికివాడగా పేరుగాంచిన ధారావి.. సెకండ్‌ వేవ్‌ విజృంభణను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. అత్యధిక జనసాంద్రత కలిగిన ఈ ప్రాంతం.. కొవిడ్‌ కట్టడిలో యావత్‌ దేశానికే ఓ మోడల్‌గా నిలుస్తోంది.

Updated : 28 May 2021 14:37 IST

కరోనా కట్టడికి ఆదర్శంగా నిలుస్తోన్న ముంబయి వ్యూహం

ముంబయి: సెకండ్‌ వేవ్‌ రూపంలో తుపానులా వచ్చి పడిన కరోనా వైరస్‌.. యావత్‌ దేశాన్ని వణికిస్తోంది. దీంతో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైరస్‌ వ్యాప్తి కట్టడికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు ఫలితాలిస్తున్నాయి. ఇదే సమయంలో దేశంలో అతిపెద్ద మురికివాడగా పేరుగాంచిన ధారావి.. సెకండ్‌ వేవ్‌ విజృంభణను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. అత్యధిక జనసాంద్రత కలిగిన ఈ ప్రాంతం.. కొవిడ్‌ కట్టడిలో యావత్‌ దేశానికే ఓ మోడల్‌గా నిలుస్తోంది.

చిన్న పరిశ్రమలకు కేంద్రం..

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ సృష్టించిన విలయానికి అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్ర. ఊహించని రీతిలో రికార్డు స్థాయి కేసులు, కొవిడ్‌ మరణాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. నిత్యం 60వేల పాజిటివ్‌ కేసులు, 900 మరణాలతో  మహారాష్ట్ర మొత్తం వణికిపోయింది. ఇదే సమయంలో ముంబయిలో రెండున్నర చదరపు కి.మీ విస్తీర్ణంలో దాదాపు 6 లక్షలకుపైగా జనాభా కలిగిన ధారావి ప్రాంతంపై తీవ్ర ఆందోళన నెలకొంది. చిన్నతరహా  పరిశ్రమలు, వస్త్ర తయారీ కేంద్రాలు ఎక్కువగా ఉండడం కూడా మరో సవాలుగా మారింది. మున్సిపల్‌ అధికారుల లెక్కల ప్రకారం, అక్కడ దాదాపు 5వేల (జీఎస్‌టీ నమోదిత) సంస్థలు, 15వేలకు పైగా సింగిల్‌ గదుల్లో ఉండే పరిశ్రమలు ఉన్నాయి. వీటితో పాటు అత్యంత చిన్న గృహ సముదాయాల్లో 8 నుంచి పదిమంది నివసించే ప్రాంతం కావడంతో భౌతిక దూరాన్ని పాటించడం అసాధ్యం.

టాయిలెట్లే అసలు సమస్య..

అత్యధిక జనసాంద్రత కలిగిన ఈ ప్రాంతంలో పరిశుభ్రత పాటించడం కష్టమైన పనిగా మారింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న జనాభాలో 80శాతం అక్కడి సామూహిక మరుగుదొడ్లపైనే ఆధారపడిన పరిస్థితి. బీఎంసీ ప్రకారం, ప్రస్తుతం అక్కడ 450 సామూహిక మరుగుదొడ్లు ఉన్నాయి. కొవిడ్‌ వ్యాప్తికి ఇవి కారణమయ్యే అవకాశం ఉండడంతో అధికారులు వీటిపైన దృష్టి కేంద్రీకరించారు. వాటిని నిత్యం మూడుసార్లు శుభ్రం చేసేలా చర్యలు తీసుకున్నారు. వీటితో పాటు ధారావి వీధులు శుభ్రంగా ఉంచేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నామని మున్సిపల్‌ అధికారులు పేర్కొన్నారు.

4T వ్యూహం (ధారావి మోడల్‌)తో కట్టడి..

నగరంలో వైరస్‌ ఉద్ధృతి పెరిగిన సమయంలో ముంబయి అధికారులు తొలుత ధారావిపైనే దృష్టిపెట్టారు. ముఖ్యంగా గతంలో (ఫస్ట్‌ వేవ్‌) అక్కడ అమలుచేసిన 4T (ట్రేసింగ్‌, ట్రాకింగ్‌, టెస్టింగ్‌, ట్రీటింగ్‌) మోడల్‌ మరోసారి ఆచరణలో పెట్టారు. డిసెంబర్‌ 2020, జనవరి 2021 మధ్యకాలంలో వైరస్‌ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ భారీ స్థాయిలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను కొనసాగించామని ధారావికి ఇంఛార్జీగా ఉన్న అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌ దిగావ్‌కర్‌ పేర్కొన్నారు. ఇక సెకండ్‌ వేవ్‌ విజృంభణ మొదలువుందని అంచనా వేసిన వెంటనే ‘ధారావి మోడల్‌‘ను అమలు చేశామని తెలిపారు. పౌరుల్లో కొవిడ్‌ లక్షణాలు తెలుసుకునేందుకు ఇంటింటికి వెళ్లి పరీక్షించడం, నగరంలో వివిధ ప్రాంతాల్లో పనిచేసే డెలివరీ సిబ్బంది, పరిశ్రమల్లోని కార్మికులకు టెస్టింగ్‌ చేపట్టడంతో పాటు నిత్యం పరిస్థితులను పర్యవేక్షించామన్నారు. అంతేకాకుండా ప్రైవేటు వైద్యం అందిస్తున్న వారిని రంగంలోకి దించి.. వారికి పీపీఈ కిట్లు, ఎన్‌95 మాస్కులు ఉచితంగా అందించారు. ధారావిని లాక్‌డౌన్‌ చేయడం సులభమే అయినా.. అక్కడి ప్రజలకు నిత్యావసరాలను సరఫరా చేయడం సవాల్‌గా మారింది. దీంతో ఒంటరిగా ఉంటున్నవారికి వండిన ఆహారాన్ని, కుటుంబాలకు రేషన్‌ సరకులను అందించారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సహాయం కూడా తీసుకున్నారు. ‘ధారావి మోడల్‌’గా పేరుగాంచిన ఈ బహుముఖ వ్యూహలను అమలు చేస్తూ.. నిత్యం పర్యవేక్షించడం వల్ల వైరస్‌ వ్యాప్తిని అదుపులోకి తీసుకువచ్చామని అధికారులు పేర్కొన్నారు.

99 నుంచి 5కు తగ్గిన కేసులు..

ఇలా కొవిడ్‌ ముప్పు పొంచివున్నప్పటికీ బహుళ వ్యూహాత్మక విధానాలతో ముందుకెళ్లిన ధారావి.. సెకండ్‌ వేవ్‌ వ్యాప్తిని అదుపులోకి తీసుకురాగలిగినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ఏప్రిల్‌ నెలలో ధారావిలో రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య 99 చేరగా ప్రస్తుతం 5కి తగ్గింది. గత రెండు రోజులుగా నిత్యం రెండు, మూడు కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ముంబయి మొత్తం నిత్యం వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నప్పటికీ ధారావిలో మాత్రం స్పల్ప కేసులు నమోదుకావడంతో ముంబయి మున్సిపల్‌ అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం దాదాపు 7వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో 6400 మంది కోలుకోగా 354 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అక్కడ క్రియాశీల కేసుల సంఖ్య 50మాత్రమే ఉన్నట్లు అధికారులు వివరించారు. అంతేకాకుండా మిగతా లగ్జరీ ప్రాంతాలో పోలిస్తే కొవిడ్‌ కేసులు ఇక్కడే అత్యంత కనిష్ఠంగా ఉన్నాయని తెలిపారు.

థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధం

ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ అదుపులోకి వచ్చినప్పటికీ రానున్న రోజుల్లో థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌ను భారీగా చేపట్టేందుకు ముంబయి అధికారులు ప్రణాళికలు రచించారు. ఇప్పటికే అక్కడ 27వేల మందికి వ్యాక్సిన్‌ అందించిన అధికారులు.. వ్యాక్సిన్‌ల లభ్యత పెరిగిన వెంటనే అందరికీ అందించే ప్రయత్నం చేస్తామన్నారు. స్థానికంగా ఉన్న 11 ఆరోగ్య కేంద్రాలతో పాటు మొబైల్‌ టెస్టింగ్‌ కేంద్రాలతో కొవిడ్‌ పరీక్షలను నిరంతరం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంస..

తొలివేవ్‌ సమయంలో ఏప్రిల్‌1, 2020లో ధారావిలో తొలి కేసు నమోదయ్యింది. ముంబయి నగరంలో తొలి కేసు నమోదైన 20 రోజుల తర్వాత ఇక్కడ పాజిటివ్‌ కేసులు వెలుగుచూడడంతో అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేశారు. ప్రత్యేక క్వారంటైన్‌ సెంటర్లు, ప్రైవేటు వైద్యులు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అనతి కాలంలోనే వైరస్‌ వ్యాప్తిని అదుపులోకి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, కొవిడ్‌ కట్టడిలో ధారావి మోడల్‌ సమర్థవంతంగా పనిచేసిందని ప్రశంసించింది. ఇదిలాఉంటే, కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం, మహారాష్ట్రలో ఇప్పటివరకు 52లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వీరిలో 92వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని