Smriti Irani: ‘ఇన్ని చేసినా మీ మంత్రి ఇంకా అమాయకుడేనా?’.. కేజ్రీవాల్‌పై స్మృతీ ఇరానీ ఫైర్‌

మనీలాండరింగ్ కేసు విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) కస్టడీలో ఉన్న దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టుపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పలు ప్రశ్నలు సంధించారు.

Published : 09 Jun 2022 01:37 IST

దిల్లీ: మనీలాండరింగ్ కేసు విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) కస్టడీలో ఉన్న దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టు విషయంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పలు ప్రశ్నలు సంధించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు. ‘‘సత్యేందర్‌ జైన్‌ షెల్‌ కంపెనీల ద్వారా రూ.16 కోట్లు హవాలాకు పాల్పడింది నిజం కాదా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

‘‘2010 నుంచి 2016 మధ్య సత్యేందర్ జైన్ సుమారు 56 షెల్ కంపెనీల ద్వారా రూ.16.39 కోట్లు మనీలాండరింగ్‌ చేసింది నిజం కాదా? అనేది నా మొదటి ప్రశ్న. దీనికి కేజ్రీవాల్‌ ఏం సమాధానం  చెబుతారు?’’ అని స్మృతి ప్రశ్నించారు. ‘‘ఈడీ సోదాలో దొరికిన రూ.2.80 కోట్లు, 133 బంగారు నాణేలను (కేజీపైనే బంగారం) సీజ్‌ చేశారా? లేదా? అయినప్పటికీ, సత్యేందర్‌ జైన్‌ అమాయకుడేనా? ఇన్‌కమ్‌ టాక్స్‌ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ చెప్పినట్లు సత్యేందర్‌ జైన్‌ రూ.16.39 కోట్ల బ్లాక్ మనీకి హక్కుదారుడు కాదనేది నిజమా? ఆయన మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు 2019లో దిల్లీ హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ స్పష్టం చేసింది నిజం కాదా?’’ అంటూ నిలదీశారు.

అంతకుముందు సత్యేందర్ జైన్ అరెస్టుపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఇది పూర్తిగా తప్పుడు కేసు అని అన్నారు. జైన్ చాలా నిజాయతీ పరుడంటూ సమర్థించారు. అతడిపై మోపిన అభియోగాలు పూర్తిగా అవాస్తవమని, ఆరోపణల్లో ఒక్క శాతం కూడా నిజం లేదన్నారు. అలాగే దిల్లీకి మొహ‌ల్లా క్లినిక్‌ల‌ను ప‌రిచ‌యం చేసింది ఆయ‌నేనని చెప్పారు. మనీలాండరింగ్ కేసులో సత్యేందర్ జైన్‌‌ను ఈడీ మే 30న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జూన్ 9 వరకు కస్టడీలో ఉండనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని