Swati Maliwal: ‘మరో అంజలి అయ్యేదాన్ని..!’ భయానక అనుభవాన్ని వివరించిన DCW చీఫ్‌

తాను, తన బృందం సరైన సమయంలో స్పందించకపోతే.. తనతోనూ అంజలి లాంటి ఘటనే జరిగి ఉండేదని దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌ తెలిపారు. దేశ రాజధానిలో ఓ వ్యక్తి ఆమెతో అనుచితంగా వ్యవహరించి, కారుతో ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే.

Published : 20 Jan 2023 01:48 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ మహిళా కమిషన్‌‌(DCW) ఛైర్‌పర్సన్ స్వాతి మాలివాల్‌(Swati Maliwal)తో ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా.. కారుతో ఆమెను కొద్ది దూరం ఈడ్చుకెళ్లాడు. అయితే.. తాను, తన టీం సభ్యుడొకరు గట్టిగా అరవడంతో అతను విడిచిపెట్టాడని, లేని పక్షంలో.. మరో అంజలి అయ్యేదనినని వాపోయారు. ఇటీవల దిల్లీ(Delhi)లో అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టి, కొన్ని కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటన(Anjali Incident) తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధిత యువతి ప్రాణాలు కోల్పోయింది.

‘నగరంలో మహిళా భద్రత చర్యలు ఎలా అమలవుతున్నాయి? అంజలి ఘటన తర్వాత పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా? అని పరిశీలించాలనుకున్నా. ఈ క్రమంలోనే ఇదంతా చోటుచేసుకుంది. కారుతో ఈడ్చుకెళ్తున్న సమయంలో నేను, మా బృంద సభ్యుడొకరు గట్టిగా అరవడంతో.. అతను నన్ను విడిచిపెట్టాడు. లేనిపక్షంలో నాకు అంజలి లాంటిది జరిగేది’ అని స్వాతి మాలివాల్‌ తన భయానక అనుభవాన్ని వివరించారు. ఈ క్రమంలోనే దేశ రాజధానిలో మహిళల భద్రతపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘దిల్లీలో సెక్యూరిటీ ఎలా ఉందో చూడండి. దిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌కి కూడా భద్రత లేకుండా పోయింది’ అని విమర్శించారు.

స్పందించిన జాతీయ మహిళా కమిషన్‌..

మరోవైపు.. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా జాతీయ మహిళా కమిషన్‌ ఈ వ్యవహారంపై స్పందించింది. రెండు రోజుల్లో ఈ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని దిల్లీ పోలీసు విభాగాన్ని ఆదేశించింది. ఎన్‌సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ ఈ మేరకు దిల్లీ కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ కేసును స్వయంగా పర్యవేక్షించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే నిందితుడు హరీశ్‌చంద్ర(47)ను అరెస్టు చేశారు. కారును స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని