Israel-hamas: అక్కడ మానవత్వం గెలిచింది..!

ఇజ్రాయెల్‌ - హమాస్‌ మధ్య ఇటీవల భారీ సైనిక ఘర్షణ జరిగింది. అదే సమయంలో ఇజ్రాయెల్‌లోని కొన్ని పట్టణాల్లో యూధులు,

Published : 24 May 2021 15:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇజ్రాయెల్‌ - హమాస్‌ మధ్య ఇటీవల భారీ సైనిక ఘర్షణ జరిగింది. అదే సమయంలో ఇజ్రాయెల్‌లోని కొన్ని పట్టణాల్లో యూదులు, అరబ్‌ల మధ్య కూడా ఘర్షణలు చెలరేగాయి. దాదాపు దశాబ్దకాలంలో ఇజ్రాయెల్‌లో జరిగిన అతిపెద్ద అంతర్గత ఘర్షణలు ఇవి. వాస్తవానికి ఇజ్రాయెల్‌లో మొత్తం యూదులు ఉండరు.. అక్కడ అరబ్‌లు కూడా ఉంటారు. ఘర్షణల్లో కొందరు పాల్గొన్నా.. మిగిలిన వారు ఇతర మతాలతో కలిసి సామరస్యపూర్వకంగా జీవిస్తారు. తాజాగా జరిగిన రెండు సంఘటనలు అక్కడ వారి మధ్య ఉన్న సామరస్య సంబంధాలను కూడా తెలియజేస్తాయి. ఘర్షణల నేపథ్యంలోనూ ఇరు వర్గాల మధ్య నెలకొన్న సుహృద్భావ వాతావరణాన్ని తెలియజేస్తాయి. మూత్రపిండం అవసరమైన ఐదుగురు పిల్లల తల్లయిన ఓ అరబ్‌ మహిళకు .. ఓ యూదుడు కిడ్నీని ఇచ్చారు. అల్లర్లలో మృతి చెందిన మరో అరబ్‌ యువకుడు ఐదుగురు యూదులకు అవయవ దానం చేసి బతికించాడు. 

ఇటీవల ఇజ్రాయెల్‌-హమాస్‌ ఘర్షణల సమయంలో లోడ్‌ అనే పట్టణంలోని ప్రజల మధ్య  కలహాలు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో యగాల్‌ యహోషువా అనే 56 సంవత్సరాల యూదు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గత వారం రాండా అవీస్‌ అనే 58 సంవత్సరాల అరబ్‌ మహిళకు అత్యవసరంగా కిడ్నీ మార్పిడి జరగాల్సి ఉంది. ఆమె ఐదుగురు పిల్లల తల్లి. ఈ నేపథ్యంలో  అతని కిడ్నిని అవీస్‌కు అమర్చారు. శస్త్రచికిత్స అనంతరం అవీస్‌ సీఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ ‘‘అమాయకుడైన ఆ వ్యక్తి  వాళ్లను ఏం చేశాడు? వారు అతడిని ఎందుకు చంపారు? అతని భార్య పిల్లల్ని ఎవరు చూసుకోవాలి? మా చిన్నప్పుడు ఇరుగు పొరుగున ఉండే యూదులతో కలిసే పెరిగాం. జాతి వివక్ష లేదని యగాల్‌ కుటుంబం రుజువు చేసింది.  వారికి ధన్యవాదాలు ’’ అని పేర్కొంది. 

మే 11న మౌస్సా హస్సౌన అనే యువకుడిని కాల్చి చంపడంతో లాడ్‌ నగరంలో అల్లర్లు చెలరేగాయి. మే 17న యగాల్‌ కారులో ఉండగా అల్లరిమూకలు రాళ్లతో దాడి చేయడంతో ఆయన చనిపోయారు. 

ఆరుగురికి జీవితాన్నిచ్చిన మహమ్మద్‌ కివాన్‌..

గత వారం తలకు గాయమైన ఓ అరబ్‌ యువకుడు ఆరుగురికి అవయవ దానం చేశాడు. వారిలో ఐదుగురు యూదులు ఉన్నారు. అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో తలకు గాయమైంది. ఇజ్రాయెల్‌లోని హైఫాలోని రంబామ్‌ హెల్త్‌కేర్‌ క్యాంపస్‌కు తరలించారు. అతను మరణించడంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. అతడి శరీంలోని ఆరు అవయవాలను అవసరమైన వారికి అమర్చి శస్త్రచికిత్స చేశారు. వారిలో ఐదుగురు యూదులు. కివాన్‌ తల్లి మాట్లాడుతూ..‘‘మేమందరం కలిసిమెలిసి జీవించే ఓకే కుటుంబానికి చెందిన వారం. మతాలు, జాతులకు అతీతంగా ప్రాణాలను కాపాడుతాం’’ అని పేర్కొన్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని