
Lakhimpur Kheri: లఖింపుర్ ఘటన.. కేంద్ర మంత్రిని తొలగించాల్సిందే!
రాష్ట్రపతిని కలిసిన రాహుల్ గాంధీ బృందం
దిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో చోటుచేసుకున్న హింసాకాండపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఆ పార్టీ నేతల బృందం బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. లఖింపుర్ ఘటనపై రాష్ట్రపతికి వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ బృందం.. ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. అంతేగాక, కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని మరోసారి డిమాండ్ చేసింది.
రాష్ట్రపతిని కలిసిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘‘లఖింపుర్ ఘటనలో మావి రెండే రెండు డిమాండ్లు. ఒకటి ఈ ఘటనపై సుప్రీంకోర్టులోని సిట్టింగ్ న్యాయమూర్తులతో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా పదవికి రాజీనామా చేయాలి లేదా ఆయనను తొలగించాలి. లఖింపుర్ ఘటనకు ముందు కూడా అజయ్ రైతులను బెదిరించిన సందర్భాలున్నాయి. అందువల్ల ఆయన పదవిలో ఉన్నంత వరకు రైతులకు న్యాయం జరగదు. ఆయనను తొలగించి సిట్టింగ్ జడ్జీలతో విచారణ జరిపించాలి. ఈ డిమాండ్లను రాష్ట్రపతి ముందుంచాం. దీనిపై ఈ రోజే ప్రభుత్వంతో చర్చిస్తానని రాష్ట్రపతి హామీ ఇచ్చారు’’ అని రాహుల్‌గాంధీ తెలిపారు.
రాహుల్ వెంట ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్, గులాం నబీ ఆజాద్, అధిర్ రంజన్ చౌధరీ రాష్ట్రపతిని కలిశారు. లఖింపుర్ ఘటనలో కేంద్రమంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆశిష్‌ను గత శనివారం అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం పోలీసు కస్టడీ ఉన్నారు.