COVID-19: యాంటీబాడీస్‌ ఎన్నిరోజులుంటాయి?

ఒకసారి కరోనా వచ్చిన వారికి మళ్లీ వస్తుందా? కరోనా బారిన పడి కోలుకున్న వారిలో యాంటీ బాడీస్‌ ఎన్ని రోజులు ఉంటాయి? ప్రస్తుతం

Published : 25 May 2021 20:28 IST

న్యూదిల్లీ: ఒకసారి కరోనా వచ్చిన వారికి మళ్లీ వస్తుందా? కరోనా బారిన పడి కోలుకున్న వారిలో యాంటీ బాడీస్‌ ఎన్ని రోజులు ఉంటాయి? ప్రస్తుతం చాలా మందిలో ఇలాంటి ప్రశ్నలెన్నో. వీటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు సెయింట్‌ లూయిస్‌లోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌ పరిశోధకులు. స్వల్ప లక్షణాలతో కరోనా నుంచి బయట పడిన వారిలోనూ నెలల తరబడి యాంటీ బాడీస్‌ ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించారు. అవి కరోనాపై సమర్థంగా పోరాడుతున్నట్లు తెలిపారు.

‘‘కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించగానే యాంటీబాడీస్‌ క్షీణిస్తున్నాయని, దీంతో త్వరగా వ్యాధి బారిన పడుతున్నారని ఇప్పటివరకూ అందరూ అనుకున్నారు. దీంతో రోగనిరోధక శక్తి అనేది ఎక్కువ కాలం ఉండదన్న భావన ఉండేది.  అయితే, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే?యాంటీబాడీలు పూర్తిగా జీరో అయిపోవడం లేదు. కేవలం తగ్గుతున్నాయంతే. ఒకసారి కరోనా బారిన పడిన వాళ్లలో 11 నెలల తర్వాత కూడా యాంటీ బాడీలు ఉత్పత్తి అవడం మేం గుర్తించాం’’ అని స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌ అసోసియేట్‌ ఫ్రొఫెసర్‌ అలీ ఎల్లిబేడీ తెలిపారు.

‘కరోనా బారిన పడిన సమయంలో యాంటీ బాడీలు రోగనిరోధక శక్తిని పెంచే సెల్స్‌ను గణనీయంగా పెంచి రక్తంలో కలిపేస్తున్నాయి. దీంతో వ్యాధితో పోరాడటానికి అవసరమైన శక్తిని శరీరం సమకూర్చుకుంటోంది. అయితే, ఒకసారి వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత వాటిలో చాలా వరకూ చనిపోతున్నాయి. అదే విధంగా రక్తంలో యాంటీబాడీల స్థాయి కూడా తగ్గుతోంది. అప్పటి నుంచి తక్కువ మొత్తంలో శరీరం యాంటీబాడీ సెల్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. వాటిలోనూ కొన్నింటిని భవిష్యత్‌లో శరీరంపై వైరస్‌ చేసే దాడిని ఎదుర్కొనేందుకు బోన్‌ మ్యారోలో దాచి ఉంచుతోంది. మళ్లీ వైరస్‌ ప్రవేశించిందని శరీరం భావిస్తే, బోన్‌ మ్యారోలో దాగి ఉన్న యాంటీబాడీలు వైరస్‌ పని పడుతున్నాయి’’ అని అలీ పేర్కొన్నారు. కరోనా బారిన పడిన 77మంది నుంచి రక్త నమూనాలు, బోన్‌ మ్యారో శాంపిల్స్‌ సేకరించిన బృందం ఈ పరిశోధన చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని