మయన్మార్‌లో విమానాలు రద్దు!

మయన్మార్‌లో అన్ని విమాన ప్రయాణాలను రద్దు చేసినట్లు ఆ దేశ విమానయానశాఖ అధికారులు సోమవారం వెల్లడించారు. మయన్మార్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కూడా ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌, ట్విటర్‌లలో ధ్రువీకరించింది.

Published : 01 Feb 2021 19:15 IST

సైన్యం చర్యలను ఖండించిన ఐరాస
ఏడాది తర్వాత ఎన్నికలు జరుపుతామని సైన్యం ప్రకటన

నేపిడా: మయన్మార్‌లో అన్ని విమాన ప్రయాణాలను రద్దు చేసినట్లు ఆ దేశ విమానయానశాఖ అధికారులు సోమవారం వెల్లడించారు. మయన్మార్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కూడా ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌, ట్విటర్‌లలో ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో అమెరికా రాయబార కార్యాలయం సెక్యూరిటీ అలర్ట్‌ను కూడా జారీ చేసింది. మయన్మార్‌లో నెలకొన్న పరిస్థితులపై అవగాహనతో ఉన్నామని యూఎస్‌ ఎంబసీ తెలిపింది. సోమవారం తెల్లవారుజామున మయన్మార్‌ సైన్యం దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

ఐరాస ఖండన..
మయన్మార్‌ కీలక నేత ఆంగ్‌సాన్‌ సూకీని నిర్బంధించి, దేశాన్ని సైన్యం అధీనంలోకి తీసుకోవడాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ఉండే అధికారాలన్నింటినీ సైన్యానికి బదిలీ చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు మయన్మార్‌లోని ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఏడాది తర్వాత ఎన్నికలు: మయన్మార్‌ సైన్యం

మయన్మార్‌ దేశం ఏడాదిపాటు సైన్యం అధీనంలో ఉంటుందని సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఏడాది తర్వాత కచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తామని వారు ప్రకటించారు. ఈ మేరకు తమ అధికారిక టీవీ ఛానల్‌లో వెల్లడించారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి అధికారాన్ని అప్పగిస్తామని తెలిపారు.

ఇవీ చదవండి..

నేల విడవని నిర్మలమ్మ

పసిడి పడింది.. వెండి పెరిగింది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని