Cyclone Asani: ‘అసని’ ఎఫెక్ట్‌.. మూడు రాష్ట్రాల్లో 50 NDRF బృందాలు

‘అసని’ తుపాను తీవ్రత దృష్ట్యా మూడు రాష్ట్రాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ అప్రమత్తమైంది. ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో 50 బృందాలను......

Published : 10 May 2022 20:24 IST

దిల్లీ: ‘అసని’ తుపాను తీవ్రత దృష్ట్యా మూడు రాష్ట్రాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ అప్రమత్తమైంది. ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో 50 బృందాలను మోహరించింది. క్షేత్ర స్థాయిలో 22 బృందాలను రంగంలోకి దించిన ఎన్డీఆర్‌ఎఫ్‌.. తుపానుతో నెలకొన్న పరిస్థితుల పర్యవేక్షణకు 28 బృందాలను సిద్ధంగా ఉంచింది. మరోవైపు, ప్రస్తుతం ‘అసని’ ఉత్తరాంధ్ర తీరానికి చేరువవుతోంది. ఏపీ, ఒడిశా తీరాల నుంచి వాయువ్య బంగాళాఖాతం వైపు కదులుతోందని భారత వాతావరణశాఖ పేర్కొంది. రానున్న 24గంటల్లో తుపాను క్రమంగా బలహీనపడుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో తుపాను సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ఏపీ, ఒడిశాలోని పలు శాఖల అధికారులతో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు.

తుపాను ప్రభావ నేపథ్యంలో ఎన్డీఆర్‌ఎఫ్ బెంగాల్‌లోని తీరప్రాంతంలోని జిల్లాల్లో 12 బృందాలను, ఏపీలోని తీర ప్రాంతాల్లో తొమ్మిది బృందాలను మోహరించింది. తుపాను తీరం దాటే వేళ తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఆర్‌ఎఫ్‌ డ్రైవ్‌ నిర్వహించింది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను గమనాన్ని నిశితంగా గమనిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ కేంద్ర కార్యాలయ అధికారులు.. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా తగిన చర్యలు చేపడుతున్నారు. కృష్ణా, కాకినాడ, తూగో, పగో, విశాఖ జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుందని ఐఎండీ తెలిపింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో గంటకు 75-95కి.మీల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. అదే, ఒడిశా తీరంలో  అయితే, గంటకు 45-65 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని అధికారుల్ని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని