దేశంలో ‘లాంబ్డా’ కేసులపై కేంద్రం ప్రకటన

కరోనా వైరస్‌లో కొత్తగా కలకలం సృష్టిస్తున్న ‘లాంబ్డా’ రకం కేసులు మన దేశంలో ఇప్పటివరకు నమోదు కాలేదని కేంద్రం స్పష్టంచేసింది. దేశంలో కరోనా పరిస్థితిపై.....

Updated : 09 Jul 2021 20:28 IST

దిల్లీ: కరోనా వైరస్‌లో కొత్తగా కలకలం సృష్టిస్తున్న ‘లాంబ్డా’ రకం కేసులు మన దేశంలో ఇప్పటివరకూ నమోదు కాలేదని కేంద్రం స్పష్టంచేసింది. దేశంలో కరోనా పరిస్థితిపై నిర్వహించిన మీడియా సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ స్పందించారు. ఈ వేరియంట్‌ను మన దేశంలోని సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సోర్టియమ్‌ (INSACOG) నిశితంగా గమనిస్తోందన్నారు. జూన్‌ 14న డబ్ల్యూహెచ్‌వో లాంబ్డాను దృష్టిసారించాల్సిన వైరస్‌ రకం (వేరియంట్ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌)లో ఏడోదిగా గుర్తించినట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఈ వైరస్‌ 25 దేశాల్లో వ్యాప్తిచెందినట్టు తెలిపారు. 

‘‘మన దేశంలో లాంబ్డా రకం కేసులు ఒక్కటికూడా నమోదుకాలేదు. INSACOG నిశితంగా గమనిస్తోంది. పెరూలో 80శాతం ఇన్ఫెక్షన్లు ఈ వేరియంటే వల్లే వచ్చాయి. దక్షిణ అమెరికాతో పాటు యూకే, యూరోపియన్‌ దేశాల్లోనూ దీన్ని గుర్తించారు. ప్రజారోగ్యంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో మానటరింగ్‌ చేస్తున్నాం’’ అని లవ్‌అగర్వాల్‌ వివరించారు. 

నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్‌ వీకేపాల్‌ దీనిపై మాట్లాడుతూ.. లాంబ్డా రకం వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ అని, ఈ వైరస్‌ గురించి పూర్తిగా తెలుసుకొనేందుకు అన్వేషణ జరుగుతోందన్నారు. ఈ వేరియంట్‌ వల్ల తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ వస్తుందనడానికి గానీ, ప్రస్తుత టీకాలను ఇది ఏమారుస్తుందనడానికి గానీ ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని