Railway Ticket for Kids: రైళ్లల్లో పిల్లలకు ‘ప్రత్యేక టికెట్‌’ వార్తలపై కేంద్రం స్పష్టత

రైళ్లలో చిన్నారులకు టికెట్‌ బుకింగ్ విధానంలో మార్పులు చేసినట్లు వస్తున్న వార్తలపై రైల్వే శాఖ స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని

Published : 17 Aug 2022 17:10 IST

దిల్లీ: రైళ్లలో చిన్నారులకు టికెట్‌ బుకింగ్ విధానంలో మార్పులు చేసినట్లు వస్తున్న వార్తలపై రైల్వే శాఖ స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని, పిల్లల టికెట్‌ బుకింగ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది.

ఇకపై రైళ్లలో ఒకటి నుంచి నాలుగేళ్లలోపు పిల్లలకు కూడా పెద్దవాళ్ల మాదిరిగానే టికెట్‌ తీసుకోవాలంటూ వార్తలు రావడంతో రైల్వే శాఖపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రైల్వేశాఖ తాజాగా స్పష్టతనిచ్చింది. ‘‘రైళ్లలో చిన్నారులకు టికెట్లు బుకింగ్‌ విధానంలో భారత రైల్వే మార్పులు చేసినట్లు కొన్ని మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఒకటి నుంచి నాలుగేళ్లలోపు పిల్లలకు ఇకపై ప్రత్యేకంగా టికెట్‌ కొనుగోలు చేయాలని రైల్వే శాఖ చెప్పినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అవన్నీ అవాస్తవ, తప్పుదోవ పట్టించే కథనాలు. చిన్నారులకు టికెట్‌ బుకింగ్‌ విధానంలో రైల్వే శాఖ ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ప్రయాణికుల డిమాండ్‌ మేరకు.. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రత్యేకంగా బెర్త్‌ గానీ, సీటు గానీ కావాలని ప్రయాణికులు కోరుకుంటే వారు పిల్లలకు సపరేట్‌గా టికెట్‌ కొనుగోలు చేసే అవకాశం కల్పించాం. ప్రత్యేకంగా బెర్త్‌ అవసరం లేదనుకుంటే పిల్లలు ఉచితంగా ప్రయాణించొచ్చు. గతంలో తీసుకొచ్చిన విధానాన్నే కొనసాగిస్తున్నాం’’ అని రైల్వే శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

2020 మార్చి 6న రైల్వేశాఖ జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం.. ఐదేళ్లలోపు పిల్లలు రైళ్లలో ఉచితంగా ప్రయాణించొచ్చు. అయితే వారికి ప్రత్యేక సీటు గానీ, బెర్త్‌గానీ కేటాయించరు. ఒకవేళ ప్రయాణికులు తమ ఐదేళ్లలోపు పిల్లలకు కూడా బెర్త్‌లు/సీట్లు కావాలనుకుంటే.. అప్పుడు వారి కోసం ప్రత్యేకంగా టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ టికెట్లకు పెద్దవారికి ఉన్న టికెట్ల ఛార్జీలే వర్తిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని