భారత్‌లో కరోనా: 149 జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్‌!

దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ..గడిచిన వారం రోజుల్లో 149జిల్లాల్లో కొత్తకేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ వెల్లడించారు.

Published : 09 Apr 2021 23:21 IST

కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ.. గడిచిన వారం రోజుల్లో 149 జిల్లాల్లో కొత్తకేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ వెల్లడించారు. కరోనా వైరస్‌ విస్తృతిపై కేంద్ర మంత్రులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన, గత రెండు వారాల్లో ఎనిమిది జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదన్నారు. ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని, ఇంతవరకూ 9.3కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు తెలిపారు.

‘వ్యాక్సిన్‌ మైత్రి’లో భాగంగానే..

అంతర్జాతీయ సమాజానికి సహాయం అందించడంలో భాగంగా.. భారత్‌ చేపట్టిన ‘వ్యాక్సిన్‌ మైత్రి’ ద్వారా విదేశాలకు వ్యాక్సిన్‌ ఎగుమతి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 85 దేశాలకు 6.45 కోట్ల డోసులను ఎగుమతి చేశామని, వీటిలో 25దేశాలకు 3.58 కోట్ల డోసులను వాణిజ్యపరంగా సరఫరా చేశామని చెప్పారు. 44 దేశాలకు మాత్రం 1.04 కోట్ల డోసులను గ్రాంట్‌ రూపంలో అందించామన్నారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని ‘కొవాక్స్‌’ కార్యక్రమం కింద 39 దేశాలకు 1.82 కోట్లను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

రోజువారీ కేసుల్లో 5.37 శాతం పెరుగుదల

దేశంలో కరోనా కేసుల సంఖ్య నిత్యం రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. ప్రస్తుతం రోజువారీగా 5.37 శాతం పెరిగినా, మరణాల రేటు 1.28 శాతానికి తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. కరోనా పాజిటివ్‌ కేసుల్లో వారం పెరుగుదల 12.93 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. భారత్‌ కంటే అమెరికా, బ్రెజిల్‌లోనే కరోనా పెరుగుదల రేటు అధికమని పేర్కొంది.

2084 కొవిడ్‌ ఆసుపత్రులు

దేశంలో పెరుగుతోన్న కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆసుపత్రుల్లో ప్రత్యేక వసతులను పెంచుతున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 2084 కొవిడ్‌ ఆసుపత్రులు ఉన్నాయని, వీటిలో 4.68 లక్షల కొవిడ్‌ పడకలు ఉన్నాయని తెలిపింది. వీటిలో 2,63,573 ఐసోలేషన్‌ పడకలు, 50,408 ఐసీయూ, 1.5 లక్షల ఆక్సిజన్‌ వసతి ఉన్న పడకలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు తప్పకుండా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని