రైతుల నిరసన.. రిలయన్స్ ప్రకటన

కేంద్రం తీసుకువచ్చిన కొత్తసాగు చట్టాల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్(ఆర్‌ఐఎల్‌) పై వస్తోన్న వార్తలను ఆ సంస్థ తోసిపుచ్చింది.

Updated : 04 Jan 2021 12:55 IST

మేం ఏ భూమిని కొనుగోలు చేయట్లేదు

ముంబయి: కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్(ఆర్‌ఐఎల్‌) పై వస్తోన్న ఆరోపణలను ఆ సంస్థ తోసిపుచ్చింది. వ్యవసాయ చట్టాలతో రిలయన్స్ సంస్థకు లబ్ధి చేకూరుతుందని చక్కర్లు కొడుతున్న వదంతులను ఖండిస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమకు కాంట్రాక్ట్ లేక కార్పొరేట్ వ్యవసాయ వ్యాపారం (ఫార్మింగ్ బిజినెస్‌)లోకి ప్రవేశించే ప్రణాళికలు లేవని వెల్లడించింది. దానికి సంబంధించి తాము ఎటువంటి భూమిని కొనుగోలు చేయలేదని, భవిష్యత్తులో అలాంటి ఆలోచనలు కూడా లేవని స్పష్టం చేసింది. 

‘శ్రమకోర్చి రైతులు పండించిన పంటకు లాభదాయకమైన ధర లభించే అంశాలకు రిలయన్స్, దాని అనుబంధ సంస్థలు పూర్తి మద్దతు ఇస్తాయి. రైతులకు కనీస మద్దతు ధరను ఇవ్వాలని మా సరఫదారులను మేం కోరుతున్నాం’ అని రిలయన్స్ తన ప్రకటనలో వెల్లడించింది. ఆర్‌ఐఎల్ నేరుగా రైతుల నుంచి ఆహార ధాన్యాలను కొనుగోలు చేయదని తెలిపింది. అలాగే తమ సరఫరాదారులు కనీస మద్దతు ధరకే ధాన్యాలు సేకరిస్తారని వెల్లడించింది. అంతేకాకుండా తక్కువ ధరలకు వాటి సేకరణకు సంబంధించి ఎలాంటి దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకోలేదని కూడా స్పష్టం చేసింది. 

ఇదిలా ఉండగా.. తమ సంస్థకు చెందిన కమ్యూనికేషన్ టవర్లను ధ్వంసం చేయడంపై పంజాబ్, హరియాణా హైకోర్టులో రిలయన్స్ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీని వెనుక తమ వ్యాపార ప్రత్యర్థుల ప్రమేయం ఉండే అవకాశం ఉందని ఆరోపించింది. ఈ విధ్వంసం నుంచి తమ ఉద్యోగులు, ఆస్తులను కాపాడేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. కాగా, కొత్త చట్టాలు కార్పొరేట్ దోపిడీకి మార్గం సుగమం చేసేలా ఉన్నాయని నెల రోజులకు పైగా రైతు సోదరులు దిల్లీ శివారుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు ఆందోళనకారులు పంజాబ్‌లోని ఆర్‌ఐఎల్‌కు చెందిన జియో యాజమాన్యంలోని 1500 మొబైల్ టవర్ల ధ్వంసానికి పాల్పడ్డారు. అలాగే ఆ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రిలయన్స్ ఫ్రెష్ దుకాణాలను మూసివేయించారు. 

ఇదిలా ఉండగా.. సాగు చట్టాలను రద్దు చేయాలంటూ అన్నదాతల నిరసన 40వ రోజుకు చేరింది. ఇప్పటికే ఆరు విడతలుగా కేంద్రం, రైతుల మధ్య చర్చలు జరిగినప్పటికీ.. ఇరు వర్గాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఈ రోజు మరోసారి భేటీ జరగనుంది. 

ఇవీ చదవండి:

ఏడోసారి చర్చలు..ఉద్యమం ముగిసేనా?

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని