Uttar Pradesh: ఇప్పుడు ఏ మాఫియా కూడా బెదిరించలేదు.. యోగి ఆదిత్యనాథ్‌

ఇప్పుడు ఏ మాఫియా కూడా రాష్ట్రంలో వ్యాపారవేత్తలను బెదిరించలేదని ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యానించారు. గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్ హత్య వేళ యోగి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Updated : 18 Apr 2023 18:58 IST

లఖ్‌నవూ: మాఫియా డాన్‌, మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌ (Atiq Ahmad)తోపాటు అతని సోదరుడు అష్రఫ్‌లు హతమైన వేళ.. ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) కీలక వ్యాఖ్యలు చేశారు. గత పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా ఉండేవని.. కానీ, ఇప్పుడు ఏ నేరస్థుడు, మాఫియా (Mafia) వ్యాపారవేత్తలను బెదిరించలేరని పేర్కొన్నారు. లఖ్‌నవూ, హర్దోయీలలో టెక్స్‌టైల్‌ పార్కుల స్థాపనకు సంబంధించిన ఓ కార్యక్రమంలో యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ ప్రసంగిస్తూ.. గత పాలనలో రాష్ట్ర గుర్తింపు సంక్షోభంలో ఉండేదని.. నేడు నేరగాళ్లు, మాఫియాల ఉనికి సంక్షోభంలో పడిందని తెలిపారు.

‘2017కు ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతిభద్రతలు అధ్వానంగా ఉండేవి. అల్లర్లతో రాష్ట్రం అపఖ్యాతి మూటగట్టుకుంది. 2017లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన అనంతరం పరిస్థితులు మారిపోయాయి.  2017 నుంచి 2023 వరకు ఒక్క అల్లరి కూడా జరగలేదు. ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధించలేదు. ఆ అవసరం కూడా రాలేదు. పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఇదే అత్యంత అనుకూలమైన సమయం. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ వ్యవస్థ పక్కాగా ఉంది. అంతకుముందు పాలనలోనూ 300కుపైగా అల్లర్లు జరిగాయి.  పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు ఇది అనుకూల అవకాశాలను సృష్టిస్తుంది. ఇప్పుడు ఏ నేరస్థుడు, మాఫియా.. వ్యాపారవేత్తలను బెదిరించలేరు. రాష్ట్రం నేడు మెరుగైన శాంతిభద్రతలకు భరోసా కల్పిస్తుంది’ అని ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను వైద్య పరీక్షల కోసం పోలీసులు ప్రయాగ్‌రాజ్‌లోని వైద్య కళాశాలకు తీసుకెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. అంతకుముందు అతీక్‌ కుమారుడు అసద్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ క్రమంలోనే.. ఉత్తర్‌ప్రదేశ్‌లో నేరాలు తారస్థాయి చేరాయని, శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ తరుణంలో యోగి ఆదిత్యనాథ్‌ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని