Agnipath: అగ్నిపథ్‌ నుంచి సైన్యంలోకి వచ్చాక మరోసారి శిక్షణ : అజిత్‌ డోభాల్‌

సైన్యం మొత్తం అగ్నివీరులతో నిండిపోదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఆందోళనలకు దారితీసిన అగ్నిపథ్‌ పథకంపై ఆయన స్పందించారు.  రెగ్యూలర్‌ సైనికులుగా ఎంపికైన అగ్నివీరులకు

Updated : 21 Jun 2022 15:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  సైన్యం మొత్తం అగ్నివీరులతో నిండిపోదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఆందోళనలకు దారితీసిన అగ్నిపథ్‌ పథకంపై ఆయన స్పందించారు. రెగ్యులర్‌ సైనికులుగా ఎంపికైన అగ్నివీరులకు మరోసారి కఠిన శిక్షణ ఉంటుందన్నారు. ఇక రెజిమెంట్లపై ఆందోళన అవసరం లేదని.. వాటిల్లో ఎలాంటి మార్పులు చేయలేదని వివరించారు. అగ్నిపథ్‌ పథకాన్ని వెనక్కి తీసుకొనే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. 

ప్రస్తుతం యుద్ధాల స్వరూపం మొత్తం మారిపోయిందని డోభాల్‌ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో టెక్నాలజీతో, కంటికి కనిపించని శత్రువుతో పోరాడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. యుద్ధాల్లో సాంకేతికత వినియోగం గణనీయంగా పెరిగిపోయిందన్నారు. మనం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సిద్ధమైతేనే మార్పు సాధ్యమన్నారు. 2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక దేశాన్ని మరింత సురక్షితంగా, దృఢంగా మార్చేందుకు ప్రాధాన్యమిచ్చారన్నారు. ఇందులో భాగంగా చాలా మార్గాలు అన్వేషించి.. చర్యలు తీసుకోవాల్సి ఉందని వివరించారు.

దేశ భద్రతకు సంబంధించిన అంశాలు స్థిరంగా ఉండవని.. చాలా వేగంగా మారిపోతాయని అజిత్‌ డోభాల్‌ పేర్కొన్నారు.  జాతీయ ప్రయోజనాలు, జాతి ఆస్తులను కాపాడే వాతావరణంతోనే దీనికి సంబంధం ఉందని తెలిపారు. పరికరాలు, సాంకేతికత, మానవ వనరులు, విధానాలు, వ్యవస్థల్లో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసే మార్పులతోనే సాధ్యమన్నారు. పాకిస్థాన్‌తో సాధారణ సంబంధాలు కోరుకొంటున్నామని.. కానీ, ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించమని స్పష్టం చేశారు. భారత్‌ను కాపాడాలని తపనపడే యువత ప్రతిభను కచ్చితంగా వాడుకొంటామని వెల్లడించారు. యువత అగ్నిపథ్‌లో చేరాలని డోభాల్‌ పిలుపునిచ్చారు. అదే సమయంలో దేశంపై, నాయకత్వంపై, మీపై మీరు విశ్వాసం ఉంచుకోవాలని సూచించారు.

 సమాజంలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించేందుకే కొంతమంది ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారని అజిత్‌ డోభాల్‌ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో హింసను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించలేమన్నారు. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ జరిగిన హింసాత్మక ఘటనల వెనుక కొన్ని కోచింగ్‌ సెంటర్ల హస్తం ఉన్నట్లు వస్తోన్న ఆరోపణలపై స్పందిస్తూ ‘ఈ దాడులకు పాల్పడుతోన్న వారిపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతున్నాయి. నిందితులను కూడా గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తి దర్యాప్తు తర్వాత ఈ దాడుల వెనుక ఎవరున్నారనే విషయం బయటపడుతుంది. అందుకే వీటిపై సమగ్ర దర్యాప్తు జరగాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని