Haj 2022: హజ్‌ యాత్ర దరఖాస్తుల స్వీకరణ షురూ.. ఈ సారి భారీ సంస్కరణలు!

పవిత్ర ‘హజ్ యాత్ర- 2022’ ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది. ముంబయిలోని హజ్ హౌస్‌లో కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ యాత్రకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 31...

Updated : 17 Oct 2022 14:45 IST

ముంబయి: పవిత్ర ‘హజ్ యాత్ర- 2022’ ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది. ముంబయిలోని హజ్ హౌస్‌లో కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ యాత్రకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ సారి హజ్‌ యాత్రలో పూర్తి ఆన్‌లైన్‌ ప్రక్రియ, వోకల్‌ ఫల్‌ లోకల్‌కు ప్రోత్సాహం తదితర అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. దీంతోపాటు యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్లు మంత్రి వివరించారు.

రెండు డోసుల టీకా తప్పనిసరి..

* కరోనా కారణంగా 2020, 2021లో భారతీయులకు హజ్‌ యాత్రకు అనుమతి లభించలేదు. ఈ విడత సైతం.. కొవిడ్ ప్రొటోకాల్స్‌, భారత్‌, సౌదీ అరేబియా ప్రభుత్వాల నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. యాత్రికులకు రెండు డోసుల టీకా పూర్తయి ఉండాలి.

* తొలిసారి పూర్తి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తుల ప్రక్రియ చేపడుతుండటం విశేషం. మొబైల్ యాప్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. యాత్రికులకు రాయితీ సౌకర్యం తొలగించినా.. ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకోనున్నారు.

* భారత్‌ హజ్ యాత్రికులు ఈ సారి 'లోకల్ ఫర్‌ వోకల్'ను ప్రోత్సహించేలా ఏర్పాట్లు. సౌదీ అరేబియాలో విదేశీ కరెన్సీతో బెడ్ షీట్లు, దిండ్లు, టవల్స్ ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా.. భారత్‌లోనే స్వదేశీ ఉత్పత్తులు అందుబాటులో ఉంచేలా చర్యలు.

* హజ్- 2022 కోసం దేశంలో ఎంబార్కేషన్ పాయింట్లు 21 నుంచి 10కి తగ్గింపు. హైదరాబాద్‌, ముంబయి, బెంగళూరు, కొచ్చిన్, దిల్లీ, అహ్మదాబాద్, గువాహటి, కోల్‌కతా, లఖ్‌నవూ, శ్రీనగర్‌లలో ఏర్పాటు.

* యాత్రికులకు ‘ఈ- మసిహా’ పేరిట ఆరోగ్య కార్డులు జారీ చేయనున్నారు. దీంతోపాటు ‘ఈ- లగేజీ ప్రీ ట్యాగింగ్‌’ ద్వారా ప్రయాణం, బస వివరాలు తెలుసుకోవచ్చు.

* ‘మెహ్‌రం (పురుష తోడు) అవసరం లేకుండా హజ్‌ యాత్ర’ కేటగిరిలో 2020, 2021లో మూడు వేలకు పైగా మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. 2022కు సైతం అవి చెల్లుబాటు కానున్నాయి. కొత్తగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కేటగిరీలో ఉన్నవారికి లాటరీ విధానంలో ఎంపిక నుంచి మినహాయింపు ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని