Flight Passenger: విమానంలో బాంబు అంటూ ప్రయాణికుడి కేకలు!

కోల్‌కతా నుంచి లండన్‌ వెళుతున్న విమానంలో బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు కేకలు వేసిన ఘటన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. దీంతో, అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులందరినీ కిందకు దింపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

Published : 06 Jun 2023 21:25 IST

కోల్‌కతా:  విమానం (Flight)లో బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు (Passenger) కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (NSCIA)లో భద్రతా బలగాలను పరుగులు పెట్టించాడు. అయితే, విమానం మొత్తాన్ని విస్తృతంగా పరిశీలించిన భద్రతా సిబ్బంది బాంబు లేదని నిర్థారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నాయి. మంగళవారం ఉదయం ఖతార్‌ ఎయిర్‌వేస్‌ (Qatar Airways)కు చెందిన విమానం కోల్‌కతా నుంచి దోహా మీదుగా లండన్‌కు బయలుదేరింది. ఈ విమానంలో 541 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం రన్‌వే మీద ఉండగా.. ఓ ప్రయాణికుడు విమానంలో బాంబు ఉందంటూ పెద్దగా అరవడం ప్రారంభించాడు. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది.. సీఐఎస్‌ఎఫ్‌ బలగాలకు సమాచారం అందించారు. 

విమానం వద్దకు చేరుకున్న భద్రతా బలగాలు.. ప్రయాణికులందరినీ కిందకు దింపి.. బాంబు స్క్వాడ్‌ బృందాలతో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. విమానంలో ఎలాంటి బాంబు లేదని తేల్చారు. ఆ తర్వాత ఆ ప్రయాణికుడిని అదుపులోకి ప్రశ్నించగా విమానంలో బాంబు ఉందని మరో ప్రయాణికుడు తనతో చెప్పినట్లు భద్రతా సిబ్బందికి తెలిపాడు. అయితే, ఆ ప్రయాణికుడి తండ్రి మాత్రం అతడి మానసిక స్థితి సరిగా లేదని, అందుకు అతను చికిత్స తీసుకుంటున్నాడని చెబుతూ.. కొన్ని మెడికల్‌ డాక్యుమెంట్స్‌ చూపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపేందుకు సదరు ప్రయాణికుడిని విమానాశ్రయ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని