Rahul Gandhi: జోడో యాత్రలో ‘మోదీ’ అంటూ నినాదాలు.. రాహుల్‌ రియాక్షన్‌ చూశారా?

భారత్‌ జోడో యాత్రలో ‘మోదీ.. మోదీ’ అంటూ కొందరు నినాదాలు చేశారు. వారికి రాహుల్‌ గాంధీ ‘ముద్దుల’తో కౌంటర్‌ ఇచ్చారు.

Published : 05 Dec 2022 18:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra)’లో కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. రాహుల్‌ పాదయాత్ర చేసుకుంటూ వెళ్తుండగా కొందరు భాజపా మద్దతుదారులు ‘మోదీ.. మోదీ’ అంటూ నినాదాలు చేశారు. అయితే ఆ నినాదాలకు స్పందనగా రాహుల్‌.. వారికి ‘ముద్దులు’ పెట్టడం గమనార్హం.

రాహుల్‌ గాంధీ నేతృత్వం వహిస్తున్న భారత్‌ జోడో యాత్ర ఆదివారం సాయంత్రం మధ్యప్రదేశ్‌ నుంచి రాజస్థాన్‌లోకి ప్రవేశించింది. అయితే మధ్యప్రదేశ్‌లోని అగర్‌ మల్వా జిల్లాలో రాహుల్ (Rahul Gandhi) యాత్ర కొనసాగుతుండగా.. కొందరు భాజపా మద్దతుదారులు ప్రధానికి మద్దతుగా ‘మోదీ.. మోదీ (Modi)’ అంటూ నినాదాలు చేశారు. ఇది చూసిన రాహుల్‌ గాంధీ తొలుత వారిని నినాదాలు ఆపాలని చేతితో సైగలు చేశారు. అయినప్పటికీ వారు నినాదాలు కొనసాగించడంతో.. జోడోలో పాల్గొన్న కాంగ్రెస్‌శ్రేణులు కూడా గట్టిగా నినాదాలు చేయాలని రాహుల్‌ కోరారు. ఆ తర్వాత భాజపా మద్దతుదారుల వైపు తిరిగి గాల్లో ముద్దులు విసిరారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం జోడో యాత్ర కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌లో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్, ఇతర కీలక నేతలు యాత్రలో పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని