SC: రాహుల్‌కు శిక్ష విధించిన జడ్జీతో సహా 68 మందికి ప్రమోషన్‌.. ‘సుప్రీం’లో సవాల్‌!

పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి హరీశ్‌ హస్‌ముఖ్‌భాయి వర్మతోసహా 68 మందికి పదోన్నతి కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. జస్టిస్‌ ఎంఆర్‌ షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై మే 8న విచారణ చేపట్టనుంది.

Published : 05 May 2023 15:56 IST

దిల్లీ: పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ (Congress) నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)ని ఇటీవల సూరత్‌ కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి హరీశ్‌ హస్‌ముఖ్‌భాయి వర్మ (HH Varma) ఈ కేసును విచారించి.. రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ క్రమంలోనే ఇటీవల హెచ్‌హెచ్‌ వర్మతోపాటు మరో 68 న్యాయమూర్తులు జిల్లా జడ్జి కేడర్‌కు పదోన్నతి దక్కింది. అయితే, వారి ప్రమోషన్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్‌ దాఖలైంది. సీనియర్ సివిల్ జడ్జి కేడర్‌కు చెందిన ఇద్దరు అధికారులు ఈ పదోన్నతులను సవాల్‌ చేశారు.

‘మెరిట్- కమ్- సీనియారిటీ’ ఆధారంగా కాకుండా.. ‘సీనియారిటీ- కమ్- మెరిట్‌’ ఆధారంగా నియామకాలు చేపట్టారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) జారీ చేసిన సెలక్షన్‌ జాబితాను, వారిని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. అంతేకాకుండా, జ్యుడిషియల్ అధికారుల నియామకానికి సంబంధించి మెరిట్- కమ్‌- సీనియారిటీ ఆధారంగా కొత్త జాబితాను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. జస్టిస్‌ ఎంఆర్‌ షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై మే 8న విచారణ చేపట్టనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని