PM Modi: కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పీఎం కేర్స్‌ సాయం ఇలా..

కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 23 ఏళ్లు వచ్చేసరికి పీఎం-కేర్స్‌ నిధి నుంచి  రూ.10లక్షల మొత్తం సాయంగా అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.

Published : 30 May 2022 19:50 IST

  ప్రకటించిన ప్రధాని మోదీ

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 23 ఏళ్లు వచ్చేసరికి పీఎం-కేర్స్‌ నిధి నుంచి  రూ.10లక్షల మొత్తం సాయంగా అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. పీఎం-కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ఇనీషియేటీవ్‌ పథకాన్ని ఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన పిల్లలకు పాఠశాలల్లో చదువుకొనే సమయంలో రూ.20,000 స్కాలర్‌షిప్‌, ప్రతినెలా రూ.4,000 ఖర్చుల నిమిత్తం అందించనున్నారు. ఈ పథకం కింద పిల్లలు ఉన్నత విద్యాభ్యాసానికి రుణాలు తీసుకొనేందుకు కూడా అర్హులు.  దీంతోపాటు ఈ చిన్నారులకు రూ.5లక్షల విలువైన హెల్త్‌కవరేజీ లభించేలా ఆయుష్మాన్‌ కార్డులను కూడా అందజేయనున్నారు. 

ఈ పథకం ప్రారంభం సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘‘కరోనా సోకి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నపిల్లల కష్టాలు తీర్చేందుకు పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ఓ చిరు ప్రయత్నం మాత్రమే. అత్యంత సున్నితమైన సమయంలో దేశం మొత్తం వారితో ఉందన్న విషయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది’’ అని పేర్కొన్నారు. అదే సమయంలో పిల్లలు ఖేలో ఇండియా, ఫిట్‌ఇండియా  కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, రానున్న యోగాదినోత్సవంలో పాల్గొనాలని కోరారు.

పీఎం కేర్స్‌ నుంచి ఆసుపత్రుల్లో వెంటిలేటర్ల కొనుగోళ్లకు, ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు సాయం అందించినట్లు మోదీ తెలిపారు. ప్రపంచానికి భారత్‌ ఓ సమస్యగా కాకుండా.. పరిష్కారంగా నిలిచిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు ఔషధాలు, టీకాలను పంపించినట్లు వివరించారు. 

2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28లోపు కరోనా కారణంగా తల్లిదండులు ఇద్దర్నీ లేదా ఒకరిని, చట్టపరమైన సంరక్షకులను, దత్తత తీసుకొన్న పేరెంట్స్‌ను కోల్పోయిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. వీరి పేర్ల నమోదుకు pmcaresforchildren.in పోర్టల్‌ను వినియోగించుకోవాలి. ఇది అనుమతుల కోసం సింగిల్‌విండో వ్యవస్థ వలే పనిచేస్తుంది. ఇప్పటి వరకు ఈ పోర్టల్‌లో 9,042 అప్లికేషన్లు రాగా.. వీటిల్లో 4,345 అప్లికేషన్లకు ఆమోదముద్ర పడింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని