Updated : 14 Sep 2021 10:35 IST

Modi-Biden: సెప్టెంబరు 24న మోదీ - బైడెన్ ముఖాముఖి

వచ్చేవారంలో మోదీ అమెరికా పర్యటన

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన ఖరారైంది. వచ్చేవారం ఆయన రెండు రోజుల పాటు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ ఆతిథ్యంలో జరగనున్న క్వాడ్‌ నేతల సదస్సులో మోదీ పాల్గొననున్నారు. దీంతో పాటు ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలోనూ ప్రసంగించనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంగళవారం వెల్లడించింది.

సెప్టెంబరు 24న వాషింగ్టన్‌లో మోదీ, బైడెన్‌, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌, జపాన్‌ ప్రధాని యోషిహిడే సుగా మధ్య క్వాడ్‌ సదస్సు జరగనుందని విదేశాంగశాఖ తమ ప్రకటనలో పేర్కొంది. ఆ తర్వాత సెప్టెంబరు 25న న్యూయార్క్‌ వేదికగా ఐరాస సర్వసభ్య సమావేశం 76వ సెషన్‌లో జరిగే ‘జనరల్‌ డిబేట్‌’లో ప్రధాని పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నట్లు తెలిపింది.

దాదాపు ఆరు నెలల తర్వాత మోదీ వెళ్తోన్న తొలి విదేశీ పర్యటన ఇదే. అంతేగాక, క్వాడ్‌ దేశాధినేతలు ముఖాముఖీగా సదస్సులో పాల్గొనడం కూడా ఇదే తొలిసారి. ఈ ఏడాది మార్చిలో క్వాడ్‌ నేతల మధ్య తొలి సదస్సు జరిగినప్పటికీ కరోనా కారణంగా ఈ నలుగురు నేతలు వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఆ భేటీలోనే క్వాడ్‌ వ్యాక్సిన్‌ ఇనిషియేటివ్‌కు శ్రీకారం చుట్టగా.. భారత్‌ కూడా పలు దేశాలకు టీకాలను ఎగుమతి చేసింది. అయితే ఆ తర్వాత మన దేశంలో రెండో దశ రావడంతో ఆ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.

తాజాగా కొవిడ్‌ ప్రధాన ఎజెండాగా వచ్చేవారం క్వాడ్‌ సదస్సు జరగనుంది. క్వాడ్‌ వ్యాక్సిన్‌ ఇనిషియేటివ్‌పై సమీక్ష నిర్వహించడంతో పాటు సైబర్‌ భద్రత, సముద్ర జలాల భద్రత, మానవతా సహకారం, వాతావరణ మార్పులు, విద్య, సాంకేతికత తదితర అంశాలపై క్వాడ్‌ నేతలు చర్చించనున్నారు. ఇక అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, తాలిబన్ల పాలనతో ఎదురయ్యే సవాళ్లను చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో కీలక సముద్ర మార్గాలపై సరికొత్త వ్యూహాల అభివృద్ధికి, అక్కడ చైనా ప్రాబల్యాన్ని నిలువరించేందుకు 2017 నవంబరులో ఇండియా, జపాన్‌, అమెరికా, ఆస్ట్రేలియా కలిసి క్వాడ్‌ కూటమిగా ఏర్పడ్డాయి. అయితే ఈ కూటమిని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని