Jodhpur tension: ఘర్షణ జరుగుతుంటే.. మౌనప్రేక్షకుల్లా ఉంటారా?: సీఎంపై కేంద్రమంత్రి విమర్శలు

రంజాన్‌ వేడుకల వేళ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చెలరేగిన ఘర్షణలపై కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. .......

Published : 04 May 2022 02:22 IST

దిల్లీ: రంజాన్‌ వేడుకల వేళ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చెలరేగిన ఘర్షణలపై కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అల్లర్లతో అశోక్‌ గహ్లోత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తృప్తి చెందిందంటూ విమర్శలు గుప్పించారు. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడం ముందస్తు వ్యూహం ప్రకారమే జరిగిందనీ.. ఉద్రిక్తతలు కొనసాగుతుంటే రాజస్థాన్‌ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం మౌనప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారని మండిపడ్డారు. మతపరమైన ఉద్రిక్తతల్ని నివారించేందుకు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలూ తీసుకోలేదని ఆరోపించారు. పోలీసులు, అధికార యంత్రాంగం ఏదో కనిపించని ఒత్తిడిలో పనిచేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. జోధ్‌పూర్‌లో అల్లర్లు చెలరేగితే.. ఈ మధ్యాహ్నం 3గంటల వరకు సీఎం అశోక్‌ గహ్లోత్‌ శాంతి, సామరస్యత కోరుతూ ఎలాంటి విజ్ఞప్తి చేయలేదన్నారు. రోమ్‌ తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా రాష్ట్రంలో హింస జరుగుతుంటే సీఎం అశోక్‌ గహ్లోత్‌ పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారని కేంద్రమంత్రి షెకావత్‌ ఆరోపించారు. ఈ ఘర్షణల వెనుక ఎవరున్నారో, ఈ ఘటనలో రాష్ట్రప్రభుత్వం, అధికార యంత్రాంగం పాత్ర ఏమిటనే అంశాలపై దర్యాప్తు జరపాల్సి ఉందన్నారు. 

మరోవైపు, నిన్న అర్ధరాత్రి జోధ్‌పూర్‌లో జలోరి గేటు సర్కిల్‌ వద్ద ఒక వర్గం వారు జెండాలు పెట్టడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాలకు చెందినవారు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో ఐదుగురు పోలీసులకు గాయాలయ్యాయి. అయితే, మంగళవారం తెల్లవారేసరికి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి ఆయా ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించినప్పటికీ ఈ ఉదయం ఈద్‌ ప్రార్థనల అనంతరం మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. జలోరి గేటు ప్రాంతంలో దుకాణాలు, వాహనాలు, ఇళ్లపై రాళ్ల దాడి జరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నగరంలోని మొబైల్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను నిలిపివేయడంతో పాటు 10 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. ప్రజలంతా శాంతి, సామరస్యతతో మెలగాలని సీఎం గహ్లోత్‌ విజ్ఞప్తి చేశారు. మే 4 అర్ధరాత్రి వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందనీ.. పుకార్లకు చెక్‌ పెట్టేందుకు మొబైల్‌ ఇంటర్నెట్ సేవలను పోలీసులు రద్దు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని