రైతుల సంక్షేమం కోసమే కొత్త చట్టాలు

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. కరోనా మహ్మమారిపై భారత

Updated : 29 Jan 2021 13:03 IST

ఆత్మనిర్భర్‌తో స్వయం సమృద్ధికి అడుగులు

రిపబ్లిక్‌ డే నాటి ఘటనలు దురదృష్టకరం

ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం 

దిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. కరోనా మహ్మమారిపై భారత పోరాటం స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. దేశ అభివృద్ధి ప్రస్థానాన్ని ఏ సవాల్‌ కూడా అడ్డుకోలేదని అన్నారు. 

ఆత్మనిర్భర్‌తో స్వయం సమృద్ధి..

‘‘స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి స్వయం సమృద్ధి సాధించడం భారత్‌కు ఓ స్వప్నం. కరోనా తెచ్చిన సంక్షోభం ఆ స్వప్నాన్ని సాకారం చేసుకునే అవకాశం కల్పించింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదంతో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేశాం. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారత్‌లో జరుగుతోంది. దేశంలో రెండు టీకాలను రూపొందించాం. అనేక దేశాలకు లక్షల డోసులను సరఫరా చేశాం. సంక్షోభం సమయంలో పొరుగుదేశాలతో కలిసి సాగుతున్నాం. దేశ ప్రజలందరి జీవన స్థితిగతుల ఉన్నతికి ఆత్మనిర్భర్‌ భారత్‌ బాటలు వేసింది’’ అని రాష్ట్రపతి తెలిపారు. 

రైతుల సంక్షేమం కోసమే నూతన చట్టాలు

‘‘దేశ రైతుల సంక్షేమం కోసమే నూతన సాగు చట్టాలను తీసుకొచ్చాం. సాగు చట్టాలతో రైతులకు కొత్త అవకాశాలు, హక్కులు లభిస్తాయి. విస్తృత చర్చల తర్వాతే కొత్త చట్టాలను పార్లమెంట్‌ ఆమోదించింది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగా మద్దతు ధరలను పెంచుతోంది. అయితే సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ.. నూతన చట్టాల అమలును నిలిపివేశాం. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సాగు చట్టాలపై ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించడం ప్రభుత్వ ప్రాధాన్యం. ఇందుకోసం అనేక పథకాలు తీసుకొచ్చాం. కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా రూ. లక్షా 13వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశాం. వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి రూ. లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ప్రారంభించాం. మత్స్యకారుల కోసం రానున్న ఐదేళ్లలో రూ. 20వేల కోట్లను ఖర్చు చేయనున్నాం. దేశంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించే కార్యక్రమం వేగంగా సాగుతోంది. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. చిన్న, సన్నకారు రైతులపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని రాష్ట్రపతి చెప్పుకొచ్చారు.

రాష్ట్రపతి ప్రసంగంలోని మరిన్ని అంశాలు..

* భారత చరిత్రలో ఇవాళ ఎంతో ప్రత్యేకం. ఈ సమావేశాలతో కొత్త దశాబ్దంలోకి అడుగుపెడుతున్నాం. స్వాతంత్ర్యం వచ్చి 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. 

* తుపాన్ల నుంచి బర్డ్‌ ఫ్లూ వరకు భారత్‌కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయితే ప్రతి సమస్యను దేశమంతా ఒక్కటిగా ఎదుర్కొంది.

* కరోనా మహమ్మారి విజృంభించిన తరుణంలో ఈ సమావేశాలు విశిష్టమైనవి. మహమ్మారి ప్రపంచంలో ప్రతి వ్యక్తిని ప్రభావితం చేసింది. లక్షల మంది విలువైన ప్రాణాలను కరోనా బలితీసుకుంది. ప్రణబ్‌ ముఖర్జీ లాంటి ఎంతోమంది నేతలను కోల్పోయాం.

* కరోనాపై భారత పోరాటం స్ఫూర్తిదాయం. పూర్తి శక్తిసామర్థ్యాలతో వైరస్‌ను ఎదుర్కొంది. సమయానుకూల నిర్ణయాలతో మహమ్మారిని సమర్థంగా కట్టడి చేసింది. లక్షలమంది పౌరుల ప్రాణాలు కాపాడేలా ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపట్టడం సంతృప్తినిచ్చింది.

* దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్నాయి. కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది.

* దేశవ్యాప్తంగా 24వేల ఆస్పత్రుల్లో ఎక్కడైనా ఆయుష్మాన్‌ భారత్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి.

* జన ఔషధి పరియోజన్‌ ద్వారా దేశవ్యాప్తంగా 7వేల కేంద్రాల్లో చౌక ధరకే ఔషధాలు అందిస్తున్నాం.

* దేశంలో కొత్తగా 22 ఎయిమ్స్‌లు ఏర్పాటుకు ఆమోదం తెలిపాం.

* కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో ప్రజాస్వామ్యం మరింత బలోపేతమైంది.

* కరోనా తెచ్చిన సంక్షోభం నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. విపత్కర పరిస్థితుల్లోనూ ప్రపంచ పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా అవతరించింది. గతేడాది దేశంలోకి విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. 

* గణతంత్ర దినోత్సవం నాడు దిల్లీలో జరిగిన ఘటనలు బాధకలిగించాయి. జాతీయ పతాకాన్ని అవమానించడం దురదృష్టకరం. భావవ్యక్తీకరణ స్వేచ్ఛనిచ్చిన రాజ్యాంగం.. చట్టాలు, నిబంధనలు పాటించాలని కూడా చెబుతోంది.

* గతేడాది జూన్‌లో భారత్‌-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది జవాన్లు అమరులయ్యారు. దేశరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ఆ అమరవీరుకు ప్రతి పౌరుడు రుణపడి ఉంటాడు. దేశ సౌభ్రాతృత్వాన్ని రక్షించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇందుకోసం సరిహద్దుల్లో ప్రభుత్వం అదనపు బలగాలను ఏర్పాటుచేసింది.

* జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ అభివృద్ధి విధానాలను ప్రజలు సమర్థిస్తున్నారు. కొన్ని వారాల క్రితం.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో జిల్లా పరిషత్‌ ఎన్నికలు విజయవంతంగా జరిగాయి.  

ఇవీ చదవండి..

2020లో 4-5 మినీబడ్జెట్‌లు ప్రవేశపెట్టాం 

అనగనగా ఓ ఆర్థిక సింహం


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని