ఆ జిల్లాల్లో కఠినంగా వ్యవహరించండి: కేంద్రం

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నా.. కొత్త వేరియంట్లు దాడి చేస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో నిబంధనలు విధించాలని....

Published : 30 Jun 2021 01:14 IST

దిల్లీ: దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నా.. కొత్త వేరియంట్ల కలకలంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు విధించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లోని ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించాలని సూచించింది. అనుసంధానంగా ఉన్న జిల్లాల్లో కఠిన పర్యవేక్షణ అవసరమని పేర్కొంది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై దృష్టిసారించాలని సూచించింది.

సోమవారం దేశ వ్యాప్తంగా 17,68,008 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 37,566 మందికి పాజిటివ్‌గా తేలింది. దాదాపు 100 రోజుల తర్వాత రోజువారీ కేసులు ఈ స్థాయిలో క్షీణించాయి. 24 గంటల వ్యవధిలో 907 మంది మరణించారు. వరుసగా రెండోరోజు వెయ్యిలోపు మరణాలు నమోదయ్యాయి. ఇకపోతే, దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,03,16,897కి చేరగా.. 3,97,637 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం 5.52లక్షల క్రియాశీల కేసులు ఉండగా.. పాజిటివిటీ రేటు 1.82 శాతానికి పడిపోయింది. మొత్తం రికవరీలు 2.93 కోట్ల మార్కును దాటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని