Raghuram Rajan: అందుకే భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్నా.. రఘురామ్‌ రాజన్‌

దేశ ఐకమత్యం, మత సామరస్యం కోసం దేశవ్యాప్తంగా నడుస్తున్న వారికి మద్దతుగానే తాను భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్నట్లు ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్ స్పష్టం చేశారు. 

Published : 03 Jan 2023 01:23 IST

దిల్లీ: రాహుల్ గాంధీ ( Rahul Gandhi) చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో ( Bharat Jodo Yatra) తాను పాల్గొన్న కొద్దిరోజుల తర్వాత ఈ అంశంపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ (Raghurama Rajan) స్పందించారు. ప్రభుత్వ మాజీ ఉద్యోగిగానో, ఆర్థికవేత్తగానో తాను జోడో యాత్రలో పాల్గొనలేదని.. దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన చెందుతున్న ఓ సాధారణ పౌరుడిలా ఈ యాత్రలో భాగమైనట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం న్యూ ఇయర్‌ రిజల్యూషన్‌ (New Year Resolution) పేరుతో రెండు పేజీల డాక్యుమెంట్‌ను లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు. 

జాతి ఐక్యత, మత సామరస్యాన్ని బలోపేతం చేసేందుకు రాహుల్‌ గాంధీ చేపట్టిన యాత్రకు తన వంతు మద్దతుగా జోడో యాత్రలో పాల్గొన్నట్లు రఘురామ్‌ రాజన్‌ స్పష్టంచేశారు. ‘‘ ప్రేమ ఉండాలి.. ద్వేషం కాదు. సమానత్వం - న్యాయం కావాలి. అణచివేత కాదు.. భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి. విభజనవాదం కాదు.. శక్తివంతమైన ప్రజాస్వామ్యం అవసరం. యుద్ధం చేసే ప్రపంచం కాదు.. సహకారం అందించుకునే సమాజం కావాలి. ప్రస్తుత ప్రపంచంలో ఇవి తమ ఉనికి కోసం పోరాడుతున్నాయి. వీటి  కోసం ప్రతి పౌరుడు తమ వంతు కృషి చేయకుంటే భవిష్యత్తులో ఇవన్నీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది ’’ అని రాజన్‌ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. వాటికి మనుగడ కోసం తన వంతుగా భారత్‌ జోడో యాత్రలో భాగమైనట్లు తెలిపారు. ‘‘భారత దేశ ఐకమత్యం, మత సామరస్యం కోసం సంప్రదాయ పద్ధతిలో  దేశవ్యాప్తంగా నడుస్తున్న వారికి మద్దతుగా నేను కూడా వాళ్లతో కలిసి కొద్ది దూరం నడిచాను’’ అని ఆయన తన రెండు పేజీలో పోస్టులో తెలిపారు.

రఘురామ్‌ రాజన్‌ గతేడాది డిసెంబరు 14న రాజస్థాన్‌లో రాహుల్‌ గాంధీతో కలిసి జోడో యాత్రలో పాల్గొన్న సంగతి తెలిసిందే.  అనంతరం రాహుల్‌తో కలిసి ఇంటర్వూలో పాల్గొన్న ఆయన ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా దేశాన్ని ఐకమత్యం చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా 2023లో ఆర్థికంగా భారత్‌తోపాటు ప్రపంచానికి సంక్షిష్టం కానుందని వ్యాఖ్యానించారు. అభివృద్ధికి అవసరమైన సంస్కరణలను భారత్‌ సిద్ధం చేయలేకపోయిందని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని