Omicron: రాజస్థాన్‌లో ఒక్కరోజే 21 ఒమిక్రాన్‌ కేసులు.. అసోంలో నైట్‌ కర్ఫ్యూ

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ దేశంలోనూ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 17 రాష్ట్రాలకు పాకిన్‌ ఈ వేరియంట్‌ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి.

Updated : 25 Dec 2021 17:48 IST

జైపూర్‌: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ దేశంలోనూ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 17 రాష్ట్రాలకు పాకిన్‌ ఈ వేరియంట్‌ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో ఒక్కరోజే 21 ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆ రాష్ట్రంలో కొత్త వేరియంట్‌ కేసుల సంఖ్య 43కు పెరిగింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ అధికారులు శనివారం వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఐదుగురు ఇటీవలే విదేశాల నుంచి తిరిగి వచ్చినట్లు తెలిపారు. ఇక, రాష్ట్రంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్‌ కేసుల్లో ఒక్క జైపుర్‌లోనే 28 కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాత అజ్మేర్‌లో 7, సికర్‌ 4, ఉదయ్‌పుర్‌లో 3 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 

అటు ఉత్తరప్రదేశ్‌లోనూ మరో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. దీంతో దేశంలో కొత్త వేరియంట్‌ కేసుల సంఖ్య 437కు పెరిగింది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 108 కేసులు రాగా.. దిల్లీలో 79, గుజరాత్‌లో 43 కేసులు బయటపడ్డాయి. 

కర్ణాటకలో 33 మంది వైద్య విద్యార్థులకు కరోనా..

కర్ణాటకలోని కోలార్‌ ప్రాంతంలో గల ఓ మెడికల్‌ కళాశాలలో 33 మంది విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితుల కాంటాక్ట్‌ ట్రేసింగ్ చేపట్టి వారికి పరీక్షలు చేస్తున్నారు. బాధిత విద్యార్థులకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం వారంతా ఆసుప్రతిలో ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 

అసోంలో రాత్రి కర్ఫ్యూ.. 

ఒమిక్రాన్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూతో పాటు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా అసోం ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ప్రతిరోజూ రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. అయితే నూతన సంవత్సర వేడుకలకు మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వడం గమనార్హం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని